తోటి పెళ్లికూతుళ్లపై లైంగిక దాడులు
చైనాలో రోజు రోజుకూ తోటి పెళ్లికూతుళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లికొడుకు మిత్రులు వారిని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారు. గత నెలలోనే పెళ్లికూతురు తరఫున 28 ఏళ్ల తోటి పెళ్లికూతురికి పీకలదాకా మద్యం తాగించడం వల్ల అమె మరణించింది. ఈ సంఘటన కొన్ని దశాబ్దాలుగా దేశంలో ఓ ఆచారంగా వస్తున్న తోటి పెళ్లికూతుళ్ల తతంగం మొదటిసారి కలవరం రేపింది. ఇటీవల తన స్నేహితురాలి పెళ్లికి తోటి పెళ్లికూతురుగా వచ్చిన లియూ యాన్ అనే సినీ నటిని పెళ్లికొడుకు మిత్రులు అమాంతంగా ఎత్తుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడేసి అల్లరి చేయడం చైనా ఇంటర్నెట్లో ఇప్పుడు హల్చల్ చేస్తోంది.
చైనాలో ఈ తోటి పెళ్లకూతుళ్ల సంప్రదాయం గణవ్యవస్థ కాలం నుంచి కొనసాగుతోంది. అప్పట్లో ఓ గణంలోని అమ్మాయికి పెళ్లంటే ఆ అమ్మాయిని ఇప్పటిలాగే ఉన్నంతలో ఖరీదైన ఆభరణాలు, దుస్తులతో అందంగా అలంకరించేవారట. శత్రుగణాలు నగల కోసం పెళ్లి కూతుళ్లను ఎత్తుకుపోయేవట. అలా జరగకుండా పెళ్లికూతుళ్లను కాపాడుకోవడం కోసం తోటి పెళ్లికూతుళ్ల తతంగం వచ్చిందని పెద్దలు చెబుతారు. వారు కూడా అచ్చంగా పెళ్లి కూతుళ్లలాగే తయారై ఇళ్లంతా సందడి చేసేవారు. ఇంటికొచ్చిన ప్రతి అతిథిని పెళ్లికూతురు పలకరించడం, మర్యాదపూర్వకంగా వారితో కలసి బియ్యంతో తయారుచేసిన వైన్ తాగడం ఆనవాయితీ. ఇందులో కూడా పెళ్లి కూతురుకు రిస్క్ ఉండడంతో ఈ కార్యక్రమాన్ని కూడా తోటి పెళ్లికూతురుతోనే చేయిస్తూ వస్తున్నారు. పెళ్లి పీటల మీదకు ఎక్కే ముందు మాత్రమే పెళ్లి కూతురు బంధు, మిత్రుల మధ్యకు వస్తుంది.
ఇలా చేయడం ద్వారా నాడు గణ వ్యవస్థలో పెళ్లికూతుళ్లను రక్షించుకోగలిగారని ఆచార, వ్యవహారాలు తెలిసిన చైనా పెద్దలు చెబుతున్నారు. పెళ్లి కూతురనుకొని తోటి పెళ్లికూతుళ్లను ఎత్తుకెళ్లిన గణాలు కూడా ఆమె ధరించిన నగలన్నీ నకిలీవని తెలిసి వదిలేసే వారట. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారంలో చాలాకాలం వరకు పెళ్లి కూతురు బంధువులు లేదా మిత్రులే తోటి పెళ్లి కూతురుగా వ్యవహరించేవారు. ఇంటికొచ్చిన అతిథులను ఆహ్వానించడం, పెళ్లి కొడుకు పరివారాన్ని ఎదుర్కోవడం, పెళ్లి తర్వాత కొత్త దంపతుల మూడు రాత్రుల ముచ్చట తీర్చేవరకు అన్ని పెళ్లి తతంగాల్లో తోటి పెళ్లి కూతురుదే ముఖ్యపాత్ర. ఒకప్పుడు మూడు రాత్రుల ముచ్చట ఎలా తీర్చుకోవాలో కూడా అనుభవంలేని పెళ్లి కొడుకులకు తోటి పెళ్లి కూతుళ్లే శిక్షణ ఇచ్చేవారట.
సమాజం మారుతున్నకొద్దీ చైనాతోపాటు భారత్ లాంటి ఆసియా దేశాల్లో తోటి పెళ్లి కూతుళ్ల తతంగం మారుతూ వచ్చి నిన్నటివరకు సింబాలిక్గానే మిగిలిపోయింది. పెళ్లిళ్లు అట్టహాసంగా, ఆర్భాటంగా చేసుకోవడంలో భాగంగా 'వెడ్డింగ్ ప్లానర్లు' వచ్చిన విషయం తెల్సిందే. ఈ వెడ్డింగ్ ప్లానర్లు పేరుకు మాత్రమే మిగిలిపోయిన తోటి పెళ్లికూతుళ్ల తతంగానికి మళ్లీ వన్నె తెచ్చారు. ఇప్పుడు దీన్ని ఓ వృత్తిగా స్వీకరిస్తూ సెలబ్రటీలుగా వెలుగుతున్న వాళ్లు పలు దేశాల్లో ఉన్నారు. తాము ప్రతి పెళ్లికి తోటి పెళ్లి కూతురును ఏర్పాటు చేస్తున్నామని, వారి అందం, మాటతీరు, కలుపుగోలుతనం తదితరాలను బట్టి రోజుకు ఒక్కో తోటి పెళ్లి కూతురుకు 2,200 రూపాయల నుంచి 9,000 రూపాయలను చెల్లిస్తున్నామని చైనాలోని దాదాపు 50 వెడ్డింగ్ ప్లానర్లు తెలియజేశారు.
కొన్ని పెళ్లిళ్లకు ఇద్దరు, ముగ్గురు తోటి పెళ్లికూతుళ్లు కావాలని కూడా కోరుతున్నారని, వారాంతంలోనే ఎక్కువ పెళ్లిళ్లు ఉంటాయి కనుక మిగతా రోజుల్లో మామూలు ఉద్యోగాలు చేసుకుంటూ వారంతంలో తోటి పెళ్లికూతుళ్ల అవతారం ఎత్తేందుకు ఉత్సాహం చూపిస్తున్నవారు ఎక్కువ మందే ఉన్నారని వారు చెప్పారు. ఒకప్పుడు పెళ్లి కూతురు, ఇప్పుడు ఆమె తరఫున తోటి పెళ్లి కూతురు బంధు, మిత్రులతో మద్యం సేవించడం సంప్రదాయం కనుక అప్పుడప్పుడు అసభ్య, అఘాయిత్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారన్నారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా చట్టాలు తీసుకొస్తే మంచిదేమోనని వారు అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు బౌన్సర్లను ఏర్పాటు చేస్తే మంచిదేమో....!