ముక్కిపోయిన రేషన్ బియ్యం
తిరువూరు : తిరువూరు రాజుపేటలోని ఒక రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వచేసిన రేషన్‌బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పౌరసరఫరాల అధికారులు తదుపరి వాటి గురించి పట్టించుకోకపోవడంతో ముక్కిపోయి పనికిరాకుండా పోయాయి. 2012 జనవరిలో తిరువూరు ఎంఎల్ఎస్ పాయింటుకు చేరాల్సిన రేషన్‌బియ్యం బస్తాల లోడును నల్లబజారుకు తరలించడంలో భాగంగా రాజుపేట మిల్లులో నిల్వచేశారు.
రేషన్‌బియ్యంతోపాటు స్వాధీనం చేసుకున్న మిల్లులో అనధికారికంగా ఉంచిన సాంబమసూరి బియ్యం మాత్రం పౌరసరఫరాల అధికారులు వేలం వేసి పాడుకున్న వ్యక్తికి అప్పగించారు. రేషన్‌బియ్యాన్ని కనీసం ఎంఎల్ఎస్ పాయింటుకు తరలించకపోవడం, గత ఏడాదిన్నర కాలంగా మిల్లులో ఉన్న బియ్యం పరిస్థితిని పట్టించుకోకపోవడంతో పురుగులుపట్టి ముక్కిపోయి, దుర్వాసన వెదజల్లుతున్నాయి. శుక్రవారం పౌరసరఫరాల విభాగం అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఎకౌంట్స్ అసిస్టెంట్ మేనేజర్ భరద్వాజ ఈ బియ్యాన్ని పరిశీలించారు.
రైస్‌మిల్లు యజమాని హరి తమ మిల్లునుంచి ఈ బియ్యం బస్తాలను తొలగించాలని పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో తిరువూరు తహశీల్దారు బాలకృష్ణారెడ్డిని పీడీఎస్ అధికారులు సంప్రదించారు. నిబంధనల పేరుతో కాలయాపన చేసిన అధికారులు రేషన్‌బియ్యాన్ని వృథా చేశారని పలువురు విమర్శిస్తున్నారు.