raitu bazars
-
రైతుబజార్లలో రూ.40కే కిలో ఉల్లి
కాకినాడ రూరల్/కర్నూలు (అగ్రికల్చర్): సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రైతుబజార్లలో శుక్రవారం నుంచి కిలో ఉల్లిని రూ.40కే ప్రజలకు అందించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో ఉల్లి పంట దెబ్బతినడంతో మార్కెట్లో కిలో ఉల్లిని రూ.80 వరకు విక్రయిస్తున్నారని చెప్పారు. దీంతో ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఉల్లి ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కాకినాడలో గురువారం మంత్రి వివరించారు. 5 వేల టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకునేందుకు నాఫెడ్ ద్వారా ఇండెంట్ పెట్టామని, అత్యవసరంగా 1,000 టన్నులు దిగుమతి చేసుకుంటున్నామన్నారు. తొలి దశలో పట్టణ, నగర ప్రాంతాల్లోని రైతుబజార్ల ద్వారా ఒక్కో కుటుంబానికి కిలో చొప్పున ఉల్లిని అందిస్తామన్నారు. కాగా, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఉల్లిని వెంటనే కొనుగోలు చేసి జిల్లాలకు సరఫరా చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తొలుత వంద టన్నుల వరకు కొనుగోలు చేసి కర్నూలు జిల్లా, వైఎస్సార్, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సరఫరా చేయాలని సూచించింది. దీంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రోఖియాబీ ఉల్లి కొనుగోలుకు గురువారం శ్రీకారం చుట్టారు. మరోవైపు పొలాల్లోకే వెళ్లి కొనుగోలు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
మార్కెట్లు, రైతు బజార్లలో సీసీ కెమెరాలు
కర్నూలు(అగ్రికల్చర్): మార్కెట్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. కర్నూలు, ఆదోని మార్కెట్ యార్డులతో పాటు కర్నూలు సి. క్యాంపు రైతుబజార్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం రైతులతో రద్దీగా ఉండే మార్కెట్లు, వినియోగదారులతో కిటకిటలాడే రైతు బజార్లలో వీటిని ఏర్పాటు చేసి దొంగతనాలు వంటి వాటిని పూర్తిగా నివారించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే సీ. క్యాంపు రైతుబజారులో సీసీ కెమెరాలున్నాయి. ఇవి అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అద్దె ఖర్చులే ఎక్కువగా ఉండటంతో డిపార్టుమెంటు ద్వారానే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. -
'చెత్త' బజార్లు!
హైదరాబాద్: ఓ వైపు 'స్వచ్ఛ భారత్' అంటూ సర్కార్ హడావుడి చేస్తుంటే... మరోవైపు పారిశుద్ధ్యంపై మార్కెటింగ్ శాఖ అధికారుల చిత్తశుద్ధి వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. నిత్యం వినియోగదారులతో రద్దీగా ఉండే పలు రైతుబజార్లలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. ఇవి అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. రోజుల తరబడి చెత్తను తొలగించని కారణంగా దుర్గంధం వెదజల్లుతూ వినియోగదారులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ఎర్రగడ్డ మోడల్ రైతుబజార్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడి చెత్తను ఏరోజుకారోజు తొలగించకపోవడంతో ఆ ప్రాంతం దుర్గంధమయమైంది. వినియోగదారులు ముక్కు మూసుకొని కూరగాయలు కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. గత్యంతరంలేని పరిస్థితుల్లో రైతులు ముక్కుకు గుడ్డకట్టుకొని అక్కడే విక్రయూలు సాగిస్తున్నారు. ఇక్కడ పోగయ్యే చెత్తను ఒక్కరోజు తొలగించకపోరుునా మరునాడు పరిస్థితి దుర్భరంగా తయూరవుతోంది. కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఇక్కడి చెత్తను తొలగించడంపై కాంట్రాక్టర్ శ్రద్ధ చూపట్లేదని తెలుస్తోంది. నెలకు సుమారు రూ.55 వేలకు పైగా బిల్లు చెల్లిస్తున్నా ఎక్కడి చెత్త అక్కడే ఉండటం వాస్తవ పరిస్థితికి దర్పణం పడుతోంది. తగినంతమంది సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో రైతుబజార్లో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. దీనికితోడు అక్కడ ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్స్‌ను ఏరోజు కారోజు తొలగించాల్సిన మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో కూరగాయలు కుళ్లిపోరుు భరించలేని విధంగా దుర్వాసన వెదజల్లుతోంది. క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇతర ఆకుకూరలు, కూరగాయల వ్యర్థాలు ఎర్రగడ్డ రైతుబజార్లో అడుగడుగునా కన్పిస్తున్నాయి. అన్నింటా అదే పరిస్థితి... నగరంలోని మిగతా రైతుబజార్లలో పారిశుద్ధ్యం పరిస్థితి ఇలాగే ఉంది. కూకట్పల్లి రైతుబజార్లో చెత్త తొలగింపు కాంట్రాక్టును కొత్తగా చేపట్టిన వ్యక్తి తగినంతమంది సిబ్బందిని నియమించట్లేదని తెలిసింది. ఇక్కడ పెద్దమొత్తంలో పోగయ్యే చెత్తను బయటకు తరలించే బాధ్యతను కూడా అతనికే అప్పగించారు. అయితే... ఈ తరలింపు ఒక్కరోజు ఆగినా పరిస్థితి ఘోరంగా తయారవుతోంది. ప్రైవేటు కాంట్రాక్టర్లు తగినంత వేతనం ఇవ్వట్లేదన్న కారణంతో పలు రైతుబజార్లలో పనిచేస్తున్న స్వీపర్లు మధ్యలోనే మానేస్తున్నారు. దాంతో సరూర్‌నగర్, అల్వాల్, వనస్థలిపురం, మీర్పేట్, ఫలక్‌నుమా రైతుబజార్లలో పరిస్థితి అధ్వానంగా మారింది. తగినంతమంది సిబ్బంది లేని కారణంగా 2, 3 రోజులకోసారి ఈ పనులు జరుగుతుండటంతో పలు రైతుబజార్ల ఆవరణ అంతా అపరిశుభ్రంగా మారుతోంది. యూజర్ చార్జీకి డిమాండ్ రైతుబజార్లలో పోగయ్యే చెత్తను తొలగించేందుకు యూజర్ చార్జీలు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రైతుబజార్ల నుంచి చెత్తను ఉచితంగానే తొలగిస్తున్నా.... హైద రాబాద్ పరిధిలోని ఎర్రగడ్డ రైతుబజార్ కాంట్రాక్టర్ నుంచి నెలకు రూ.2వేలు జీహెచ్ఎంసీ సిబ్బంది వసూలు చేస్తున్నట్లు సమాచారం. మిగతా రైతుబజార్లు కూడా యూజర్ఛార్జీ చెల్లిస్తేనే డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేస్తామని అక్కడి శానిటరీ ఇన్స్పెక్టర్లు తెగేసి చెబుతుండటంతో రైతుబజార్ సిబ్బంది బిక్కమొహం వేస్తున్నారు.