'చెత్త' బజార్లు!
హైదరాబాద్: ఓ వైపు 'స్వచ్ఛ భారత్' అంటూ సర్కార్ హడావుడి చేస్తుంటే... మరోవైపు పారిశుద్ధ్యంపై మార్కెటింగ్ శాఖ అధికారుల చిత్తశుద్ధి వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. నిత్యం వినియోగదారులతో రద్దీగా ఉండే పలు రైతుబజార్లలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. ఇవి అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. రోజుల తరబడి చెత్తను తొలగించని కారణంగా దుర్గంధం వెదజల్లుతూ వినియోగదారులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు.
ఎర్రగడ్డ మోడల్ రైతుబజార్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడి చెత్తను ఏరోజుకారోజు తొలగించకపోవడంతో ఆ ప్రాంతం దుర్గంధమయమైంది. వినియోగదారులు ముక్కు మూసుకొని కూరగాయలు కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. గత్యంతరంలేని పరిస్థితుల్లో రైతులు ముక్కుకు గుడ్డకట్టుకొని అక్కడే విక్రయూలు సాగిస్తున్నారు. ఇక్కడ పోగయ్యే చెత్తను ఒక్కరోజు తొలగించకపోరుునా మరునాడు పరిస్థితి దుర్భరంగా తయూరవుతోంది.
కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఇక్కడి చెత్తను తొలగించడంపై కాంట్రాక్టర్ శ్రద్ధ చూపట్లేదని తెలుస్తోంది. నెలకు సుమారు రూ.55 వేలకు పైగా బిల్లు చెల్లిస్తున్నా ఎక్కడి చెత్త అక్కడే ఉండటం వాస్తవ పరిస్థితికి దర్పణం పడుతోంది. తగినంతమంది సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో రైతుబజార్‌లో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. దీనికితోడు అక్కడ ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్స్‌ను ఏరోజు కారోజు తొలగించాల్సిన మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో కూరగాయలు కుళ్లిపోరుు భరించలేని విధంగా దుర్వాసన వెదజల్లుతోంది. క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇతర ఆకుకూరలు, కూరగాయల వ్యర్థాలు ఎర్రగడ్డ రైతుబజార్‌లో అడుగడుగునా కన్పిస్తున్నాయి.
అన్నింటా అదే పరిస్థితి...
నగరంలోని మిగతా రైతుబజార్లలో పారిశుద్ధ్యం పరిస్థితి ఇలాగే ఉంది. కూకట్‌పల్లి రైతుబజార్‌లో చెత్త తొలగింపు కాంట్రాక్టును కొత్తగా చేపట్టిన వ్యక్తి తగినంతమంది సిబ్బందిని నియమించట్లేదని తెలిసింది. ఇక్కడ పెద్దమొత్తంలో పోగయ్యే చెత్తను బయటకు తరలించే బాధ్యతను కూడా అతనికే అప్పగించారు. అయితే... ఈ తరలింపు ఒక్కరోజు ఆగినా పరిస్థితి ఘోరంగా తయారవుతోంది. ప్రైవేటు కాంట్రాక్టర్లు తగినంత వేతనం ఇవ్వట్లేదన్న కారణంతో పలు రైతుబజార్లలో పనిచేస్తున్న స్వీపర్లు మధ్యలోనే మానేస్తున్నారు. దాంతో సరూర్‌నగర్, అల్వాల్, వనస్థలిపురం, మీర్‌పేట్, ఫలక్‌నుమా రైతుబజార్లలో పరిస్థితి అధ్వానంగా మారింది. తగినంతమంది సిబ్బంది లేని కారణంగా 2, 3 రోజులకోసారి ఈ పనులు జరుగుతుండటంతో పలు రైతుబజార్ల ఆవరణ అంతా అపరిశుభ్రంగా మారుతోంది.
యూజర్ చార్జీకి డిమాండ్
రైతుబజార్లలో పోగయ్యే చెత్తను తొలగించేందుకు యూజర్ చార్జీలు చెల్లించాలంటూ జీహెచ్‌ఎంసీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రైతుబజార్ల నుంచి చెత్తను ఉచితంగానే తొలగిస్తున్నా.... హైద రాబాద్ పరిధిలోని ఎర్రగడ్డ రైతుబజార్ కాంట్రాక్టర్ నుంచి నెలకు రూ.2వేలు జీహెచ్‌ఎంసీ సిబ్బంది వసూలు చేస్తున్నట్లు సమాచారం. మిగతా రైతుబజార్లు కూడా యూజర్‌ఛార్జీ చెల్లిస్తేనే డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేస్తామని అక్కడి శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తెగేసి చెబుతుండటంతో రైతుబజార్ సిబ్బంది బిక్కమొహం వేస్తున్నారు.