Raiway department
-
రైలు ఆపి, ప్రాణం నిలిపి
యశవంతపుర: రైలు పట్టాలపై ఉన్న వ్యక్తిని గమనించిన లోకోపైలట్ రైలు వేగాన్ని తగ్గించి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా సుళ్య వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. బెంగళూరు నుండి కుక్కే సుబ్రమణ్యరోడ్డు, పుత్తూరు మార్గంలో కారవారకు వెళ్తుండగా సరిమొగరు, ఎడమంగల స్టేషన్ల మధ్య రైలు వేగంగా వస్తోంది. అదే సమయంలో పట్టాలపై 45 ఏళ్ల వ్యక్తి ఉండటాన్ని దూరం నుంచి గమనించిన లోకోపైలెట్ అతని ప్రాణాలను కాపాడాలని రైలు వేగాన్ని తగ్గిస్తూ వచ్చాడు. అతని సమీపానికి వచ్చేలోపే రైలు పూర్తిగా వేగం తగ్గింది. అతనికి ఢీకొనగా చిన్నపాటి గాయాలయ్యాయి. ఆ వెంటనే లోకోపైలెట్, టీసీ బాధితుడిని అదే రైలులో తీసుకుని పుత్తూరు రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి రైల్వే సిబ్బంది అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. (చదవండి: హెలికాప్టర్ సర్వీస్ అని రూ. 17 వేలు టోపి) -
పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు
జనగామ: జనగామ జిల్లా కేంద్రం రైల్వేస్టేషన్ వ్యాగన్ పాయింట్ లైన్‌పై గూడ్స్‌రైలు పట్టాలు తప్పిన సంఘటన శనివారం తెల్లవారు జామున 2గంటలకు జరిగింది. జనగామలో బియ్యం లోడ్ చేసుకుని వెళ్లే క్రమంలో బోగీలు పట్టాలు తప్పి భారీ శబ్దం రావడంతో గార్డు అప్రమత్తం కాగా పెనుప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి... జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ప్రధాన లైన్ పక్కనే వ్యాగన్ పాయింట్ కోసం ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. రెండు ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేసి, గూడ్స్‌రైలులో బియ్యం తరలిస్తుంటారు. రైస్ మిల్లర్స్తోపాటు ప్రభుత్వం ఎగుమతి చేసే సివిల్ సప్లయ్ బియ్యాన్ని ఈమార్గంలో తీసుకువెళ్తుంటారు. ఈక్రమంలో శుక్రవారం 42 బోగీలతో ఉన్న గూడ్స్‌రైలు జనగామకు చేరుకుంది. బోగీలను రెండుగా వేరు చేసి (21 బోగీలు) రాత్రి వరకు బియ్యం లోడ్ చేశారు. గూడ్స్ బోగీల్లో లోడ్ చేసిన స్టాక్ వివరాల ప్రకారం సరి చూసుకుని, అధికారులు సీల్ చేశారు. రెండో లైన్‌పై ఉన్న 21 బోగీలను తీసుకుని.. మొదటి ట్రాక్‌పై ఉన్న మిగతా వాటిని కలుపుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐదు బోగీలతో ఇంజన్ ప్రధాన లైన్ పైకి వెళ్లగానే పెద్ద శబ్దం రావడంతో గార్డు అప్రమత్తమయ్యారు. వెంటనే బ్రేక్ అప్లైయ్ చేయడంతో గూడ్స్‌రైలు అక్కడే ఆగింది. అప్పటికే మూడు బోగీలు పట్టాలు తప్పి ముందుకు వెళ్లడంతో పట్టాలకు మధ్యలో ఉండే కాంక్రీట్ స్లీపర్లు పూర్తిగా విరిగిపోయాయి. హుటాహుటిన చేరుకున్న రైల్వే ఉన్నతాధికారులు గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయాన్ని తెలుసుకున్న సౌత్ సెంట్రల్ ఉన్నతాధికారులు హుటాహుటిన జనగామ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఎయిర్ మిషన్లు, ట్రాక్స్ మెకానిక్, సాంకేతిక నిపుణులు, సిబ్బందిని రప్పించారు. తెల్లవారుజాము 3 గంటలకు పనులు ప్రారంభించారు. పట్టాలు తప్పి, గూడ్స్‌రైలు దూసుకురావడంతో విరిగిపోయిన కాంక్రీట్ స్లీపర్ స్థానంలో కొత్తగా వేసి, ఎయిర్ ప్రెషర్‌తో ఏడు గంటల పాటు కష్టపడి బోగీ చక్రాలను పట్టాల పైకి ఎక్కించారు. ఎలా జరిగింది? ప్రధాన లైన్‌పై ఉన్న శ్రద్ధ.. వ్యాగన్ పాయింట్ ట్రాక్‌పై లేదని తెలుస్తోంది. రబీ, ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఇక్కడి నుంచి మన రాష్ట్రంతో పక్క రాష్ట్రాలకు బియ్యం తరలిస్తుంటారు. ఇందుకోసం రెండు లైన్లు ఉండగా.. వీటి నిర్వహణపై పర్యవేక్షణ అంతంత మాత్రమేనని ప్రచారం జరుగుతోంది. 42 బోగీల గూడ్స్‌రైలు బియ్యం లోడ్‌తో వెళ్తున్న క్రమంలో పట్టాలు తప్పడం సౌత్‌సెంట్రల్ రైల్వే అధికారులను కలవరపాటుకు గురిచేసింది. ఇటీవల అడపదడపా కురుస్తున్న వర్షాలతో పట్టాలు కొంతమేర కిందకు కుంగినట్లు పలువురు రైల్వే అధికారులు చర్చించుకోవడం కనిపించింది. ఐదు బోగీలతో ప్రధాన లైన్ మీదకు వెళ్లిన ఇంజన్... ఇంకొంచెం ముందుకు వెళ్తే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి ఉండేది. ఉత్తర, దక్షిణ భారత దేశాలకు ప్రధాన రవాణా మార్గమైన జనగామ మీదుగా అనేక రైళ్లు నడుస్తుంటాయి. కాగా పట్టాలు తప్పిన విషయమై సౌత్‌సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు క్లారిటీగా చెప్పడం లేదు. విచారణకు ఆదేశం జనగామ వ్యాగన్ పాయింట్ ట్రాక్‌పై గూడ్స్‌రైలు పట్టాలు తప్పిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. నిత్యం ట్రాక్ నిర్వహణపై పర్యవేక్షణ చేస్తున్న క్రమంలో ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇక్కడి అధికారలుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్ని బోగీలు పట్టాలు తప్పాయి? ప్రమాదానికి గల కారణం, బాధ్యులు ఎవరనే దానిపై సమగ్రమైన నివేదికలను అందించాలని కోరినట్లు తెలుస్తోంది. -
అర్ధరాత్రి కలకలం
ఆదిలాబాద్‌టౌన్ : ‘హలో సార్.. నేను రైల్వే నుంచి మాట్లాడుతున్నా.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉండం దగ్గర పూర్ణ ఎక్స్‌ప్రెస్ రైలు ఓ ట్రక్‌ను ఢీకొని బోల్తాపడింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి’ మంగళవారం అర్ధరాత్రి డయల్ 100 నంబరుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను చెప్పాల్సింది చెప్పి పెట్టేశాడు. వెంటనే ఆదిలాబాద్ పోలీసుల ఫోన్ మోగింది. ఆ కాల్ డయల్ 100 సెంటర్ నుంచి వచ్చింది. రైలు ప్రమాదం గురించి సమాచారం ఇచ్చింది. ఇక చూడండి.. అర్ధరాత్రి పూట అధికారుల ఉరుకులు.. పరుగులు..! హుటాహుటిన పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ, తదితర శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రైలులో ప్రయాణం చేస్తున్న వారి బంధువులు, స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఆదిలాబాద్ రైల్వే ట్రాక్ నుంచి ఉండం వరకు ప్రమాదం ఎక్కడ జరిగిందని వెతుక్కుంటూ వెళ్లారు. తీరా తెల్లవారుజామున 4గంటల సమయంలో రైల్వే అధికారులు మాక్ డ్రిల్ చేశామని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారో లేదో, సంఘటన జరిగితే స్పందన ఎలా ఉంటుందోనని చావుకబురు చల్లగా చెప్పడంతో అందరూ బిత్తరపోయారు. అయితే ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులపై ఫైర్.. రైల్వే అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా మాక్‌డ్రిల్ నిర్వహించడంపై జిల్లా ఎస్పీతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని రైల్వే అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. పూర్ణ ఎక్స్‌ప్రెస్ ట్రక్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడి ఉంటుందని, ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందోనని అంబులెన్స్‌ను, ఫైర్ ఇంజన్, తదితర ఏర్పాట్లను చేశామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగంతో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల వారికి కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మాక్‌డ్రిల్ అంటే.. ఏదైనా రైలు ప్రమాదం జరిగితే జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుంది, సంఘటన స్థలానికి ఎంత సమయంలో చేరుకుంటారు, వైద్యసేవలు, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారనే విషయాలను తెలుసుకునేందుకు రైల్వే అధికారులు చేపట్టే కార్యక్రమం మాక్‌డ్రిల్. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమై వెంటనే రైల్వే అధికారులు తెలిపిన ఉండం రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ, సీఐలు, ఆర్డీఓ, తహసీల్దార్లు, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, ఇదితర శాఖల అధికారులు, సిబ్బంది సైతం స్పందించారు. ఏదేమైనా ఇలాంటి మాక్‌డ్రిల్ నిర్వహించే ముందు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంఘటన స్థలంలో డీఎస్పీ నర్సింహారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ విశ్వప్రసాద్, ఎస్సైలు, పోలీసులు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. -
పట్టా.. ఫట్ ఫట్
గుంతకల్లు : శీతాకాలం వస్తుందంటే రైల్వే శాఖలో వణుకు పుడుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టడంతో వెల్డింగ్ చేసిన చోట రైలు కమ్మీలు విరిగిపోతుంటారుు. మధ్యలో చిన్న పాటి క్రాక్ మొదలై.. ఎక్కువ బరువు ఉన్న వ్యాగన్లు నెమ్మదిగా వెళ్లిన తర్వాత కమ్మీ విరిగిపోతోంది. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు గ్యాంగ్మెన్లు గమనించి లోపాలను సరిదిద్ది ప్రమాదాలు జరగకుండా నివారిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లరేగడి, చెరువుల సమీపంలో ఉన్న ట్రాక్‌ల వద్ద ఈ సమస్య అధికంగా ఉంటుంది. వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి రాత్రి 10 గంటల మధ్య రైలు కమ్మీలు చలి తీవ్రతకు బ్రేక్ అవుతుంటాయి. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షించడానికి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది పని చేస్తుంటారు. రైల్వే లోకో సిబ్బంది (రైళ్ల డ్రైవర్లు, సహ డ్రైవర్లు) అప్రమత్తంగా లేకపోతే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. లోకో రన్నింగ్ సిబ్బంది ఏమాత్రం అజాగ్రత్త వహించినా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడం తథ్యం. గుంతకల్లు డివిజన్ మొత్తం మీద 1354.27 కిలోమీటర్ల రైలు మార్గం విస్తరించి ఉంది. ఈ మార్గాన్ని పర్యవేక్షించడానికి డివిజన్ పరిధిలో 23 ఇంజనీరింగ్ డిపోలు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. అయినప్పటికీ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత ఐదేళ్లలో వేలాది మంది పదవీ విరమణ చేశారు. ఖాళీ పోస్టుల భర్తీ మాత్రం అంతంత మాత్రమే. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 6,031 పోస్టులు ఉండాల్సి ఉంది. డివిజన్ వ్యాప్తంగా చూస్తే 5,034 మంది మాత్రమే పని చేస్తున్నారు. 997పోస్టులు ఖాళీ ఉన్నాయని అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. అసలే సిబ్బంది కొరత ఉన్న ఇంజనీరింగ్ విభాగంలో కొందరు సిబ్బంది గ్యాంగ్‌ల్లో పని చేయడం చేతకాక అధికారుల నివాస గృహాల్లో ఇంటి పనులు చేస్తూ సర్వీస్‌ను కొనసాగిస్తున్నారు. ఇలా డివిజన్ మొత్తం మీద 200 మంది ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పైస్థాయి అధికారుల గృహాల్లో పని చేస్తున్నట్లు సమాచారం. దురదృష్టవశాత్తు రైలు ప్రమాదాలు సంభవిస్తే ఎవరూ బాధ్యత తీసుకోరని సీనియర్ పర్యవేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షిస్తూ పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తూ రైలు ప్రమాదాలు నివారించాలంటే రైల్వేబోర్డు నిబంధనల ప్రకారం తగినంత సిబ్బందిని నియమించాల్సి ఉంది.