ముమ్మరంగా ట్రాక్ పనులు చేస్తున్న సిబ్బంది
జనగామ: జనగామ జిల్లా కేంద్రం రైల్వేస్టేషన్ వ్యాగన్ పాయింట్ లైన్‌పై గూడ్స్‌రైలు పట్టాలు తప్పిన సంఘటన శనివారం తెల్లవారు జామున 2గంటలకు జరిగింది. జనగామలో బియ్యం లోడ్ చేసుకుని వెళ్లే క్రమంలో బోగీలు పట్టాలు తప్పి భారీ శబ్దం రావడంతో గార్డు అప్రమత్తం కాగా పెనుప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి... జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ప్రధాన లైన్ పక్కనే వ్యాగన్ పాయింట్ కోసం ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. రెండు ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేసి, గూడ్స్‌రైలులో బియ్యం తరలిస్తుంటారు. రైస్ మిల్లర్స్‌తోపాటు ప్రభుత్వం ఎగుమతి చేసే సివిల్ సప్లయ్ బియ్యాన్ని ఈమార్గంలో తీసుకువెళ్తుంటారు.
ఈక్రమంలో శుక్రవారం 42 బోగీలతో ఉన్న గూడ్స్‌రైలు జనగామకు చేరుకుంది. బోగీలను రెండుగా వేరు చేసి (21 బోగీలు) రాత్రి వరకు బియ్యం లోడ్ చేశారు. గూడ్స్ బోగీల్లో లోడ్ చేసిన స్టాక్ వివరాల ప్రకారం సరి చూసుకుని, అధికారులు సీల్ చేశారు. రెండో లైన్‌పై ఉన్న 21 బోగీలను తీసుకుని.. మొదటి ట్రాక్‌పై ఉన్న మిగతా వాటిని కలుపుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐదు బోగీలతో ఇంజన్ ప్రధాన లైన్ పైకి వెళ్లగానే పెద్ద శబ్దం రావడంతో గార్డు అప్రమత్తమయ్యారు. వెంటనే బ్రేక్ అప్‌లైయ్ చేయడంతో గూడ్స్‌రైలు అక్కడే ఆగింది. అప్పటికే మూడు బోగీలు పట్టాలు తప్పి ముందుకు వెళ్లడంతో పట్టాలకు మధ్యలో ఉండే కాంక్రీట్ స్లీపర్‌లు పూర్తిగా విరిగిపోయాయి.
హుటాహుటిన చేరుకున్న రైల్వే ఉన్నతాధికారులు
గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయాన్ని తెలుసుకున్న సౌత్ సెంట్రల్ ఉన్నతాధికారులు హుటాహుటిన జనగామ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఎయిర్ మిషన్లు, ట్రాక్స్ మెకానిక్, సాంకేతిక నిపుణులు, సిబ్బందిని రప్పించారు. తెల్లవారుజాము 3 గంటలకు పనులు ప్రారంభించారు. పట్టాలు తప్పి, గూడ్స్‌రైలు దూసుకురావడంతో విరిగిపోయిన కాంక్రీట్ స్లీపర్ స్థానంలో కొత్తగా వేసి, ఎయిర్ ప్రెషర్‌తో ఏడు గంటల పాటు కష్టపడి బోగీ చక్రాలను పట్టాల పైకి ఎక్కించారు.
ఎలా జరిగింది?
ప్రధాన లైన్‌పై ఉన్న శ్రద్ధ.. వ్యాగన్ పాయింట్ ట్రాక్‌పై లేదని తెలుస్తోంది. రబీ, ఖరీఫ్ సీజన్‌లో ఎక్కువగా ఇక్కడి నుంచి మన రాష్ట్రంతో పక్క రాష్ట్రాలకు బియ్యం తరలిస్తుంటారు. ఇందుకోసం రెండు లైన్లు ఉండగా.. వీటి నిర్వహణపై పర్యవేక్షణ అంతంత మాత్రమేనని ప్రచారం జరుగుతోంది. 42 బోగీల గూడ్స్‌రైలు బియ్యం లోడ్‌తో వెళ్తున్న క్రమంలో పట్టాలు తప్పడం సౌత్‌సెంట్రల్ రైల్వే అధికారులను కలవరపాటుకు గురిచేసింది. ఇటీవల అడపదడపా కురుస్తున్న వర్షాలతో పట్టాలు కొంతమేర కిందకు కుంగినట్లు పలువురు రైల్వే అధికారులు చర్చించుకోవడం కనిపించింది. ఐదు బోగీలతో ప్రధాన లైన్ మీదకు వెళ్లిన ఇంజన్... ఇంకొంచెం ముందుకు వెళ్తే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి ఉండేది. ఉత్తర, దక్షిణ భారత దేశాలకు ప్రధాన రవాణా మార్గమైన జనగామ మీదుగా అనేక రైళ్లు నడుస్తుంటాయి. కాగా పట్టాలు తప్పిన విషయమై సౌత్‌సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు క్లారిటీగా చెప్పడం లేదు.
విచారణకు ఆదేశం
జనగామ వ్యాగన్ పాయింట్ ట్రాక్‌పై గూడ్స్‌రైలు పట్టాలు తప్పిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. నిత్యం ట్రాక్ నిర్వహణపై పర్యవేక్షణ చేస్తున్న క్రమంలో ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇక్కడి అధికారలుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్ని బోగీలు పట్టాలు తప్పాయి? ప్రమాదానికి గల కారణం, బాధ్యులు ఎవరనే దానిపై సమగ్రమైన నివేదికలను అందించాలని కోరినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment