గుంతకల్లు : శీతాకాలం వస్తుందంటే రైల్వే శాఖలో వణుకు పుడుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టడంతో వెల్డింగ్ చేసిన చోట రైలు కమ్మీలు విరిగిపోతుంటారుు. మధ్యలో చిన్న పాటి క్రాక్ మొదలై.. ఎక్కువ బరువు ఉన్న వ్యాగన్లు నెమ్మదిగా వెళ్లిన తర్వాత కమ్మీ విరిగిపోతోంది. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు గ్యాంగ్‌మెన్‌లు గమనించి లోపాలను సరిదిద్ది ప్రమాదాలు జరగకుండా నివారిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నల్లరేగడి, చెరువుల సమీపంలో ఉన్న ట్రాక్‌ల వద్ద ఈ సమస్య అధికంగా ఉంటుంది. వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి రాత్రి 10 గంటల మధ్య రైలు కమ్మీలు చలి తీవ్రతకు బ్రేక్ అవుతుంటాయి. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షించడానికి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది పని చేస్తుంటారు. రైల్వే లోకో సిబ్బంది (రైళ్ల డ్రైవర్లు, సహ డ్రైవర్లు) అప్రమత్తంగా లేకపోతే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
లోకో రన్నింగ్ సిబ్బంది ఏమాత్రం అజాగ్రత్త వహించినా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడం తథ్యం. గుంతకల్లు డివిజన్ మొత్తం మీద 1354.27 కిలోమీటర్ల రైలు మార్గం విస్తరించి ఉంది. ఈ మార్గాన్ని పర్యవేక్షించడానికి డివిజన్ పరిధిలో 23 ఇంజనీరింగ్ డిపోలు రేయింబవళ్లు పని చేస్తున్నాయి.
అయినప్పటికీ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత ఐదేళ్లలో వేలాది మంది పదవీ విరమణ చేశారు. ఖాళీ పోస్టుల భర్తీ మాత్రం అంతంత మాత్రమే. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 6,031 పోస్టులు ఉండాల్సి ఉంది. డివిజన్ వ్యాప్తంగా చూస్తే 5,034 మంది మాత్రమే పని చేస్తున్నారు. 997పోస్టులు ఖాళీ ఉన్నాయని అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. అసలే సిబ్బంది కొరత ఉన్న ఇంజనీరింగ్ విభాగంలో కొందరు సిబ్బంది గ్యాంగ్‌ల్లో పని చేయడం చేతకాక అధికారుల నివాస గృహాల్లో ఇంటి పనులు చేస్తూ సర్వీస్‌ను కొనసాగిస్తున్నారు.
ఇలా డివిజన్ మొత్తం మీద 200 మంది ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పైస్థాయి అధికారుల గృహాల్లో పని చేస్తున్నట్లు సమాచారం. దురదృష్టవశాత్తు రైలు ప్రమాదాలు సంభవిస్తే ఎవరూ బాధ్యత తీసుకోరని సీనియర్ పర్యవేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షిస్తూ పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తూ రైలు ప్రమాదాలు నివారించాలంటే రైల్వేబోర్డు నిబంధనల ప్రకారం తగినంత సిబ్బందిని నియమించాల్సి ఉంది.
పట్టా.. ఫట్ ఫట్
Published Thu, Dec 4 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM
Advertisement
Advertisement