నన్ను జైల్లో పెట్టించారు.. ఆ పార్టీకి ఓటేయను!
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 10 రాజ్యసభ సీట్లకు జరిగిన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 8, ఎస్పీ ఒక స్థానంలో సులభంగా గెలిచేందుకు అవకాశం ఉండగా.. పదో స్థానం కోసం బీజేపీ అదనంగా బరిలో దించిన అభ్యర్థికి, బీఎస్పీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్ని విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తన ఓటు బీఎస్పీ అధినేత్రి మామావతి పార్టీకి మాత్రం కచ్చితంగా కాదని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా అన్నారు. తన ఓటు సమాజ్‌వాదీ పార్టీకి చెందుతుందన్నారు.
ఓటేసిన అనంతరం రఘురాజ్ ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో నాపై తప్పుడు కేసులు బనాయించి అప్పటి సీఎం మాయావతి నన్ను జైలుకు పంపారు. ఆ మరుసటి ఏడాది (2003లో) ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సీఎం అయ్యాక నాపై నమోదైన తప్పుడు కేసుల నుంచి విముక్తి కల్పించారు. అందుకే ఎస్పీకి, ములాయం, అఖిలేశ్‌లంటే ఎంతో గౌరవం ఇస్తానన్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి బీంరావ్ అంబేద్కర్‌కు ఎస్పీ మద్దతు ఇస్తోంది కదా. మీ ఓటు బీఎస్పీకి వెళ్తుందా అని మీడియా రాజా భయ్యాను అడగగా ఆ ఎమ్మెల్యే ఇలా స్పందించారు.
'నా ఓటు ఎస్పీకే చెందుతుంది. ఎస్పీ-బీఎస్పీ పొత్తు గురించి నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ అన్యాయంగా నాపై కేసులు బనాయించి జైల్లో పెట్టించిన మామావతి పార్టీ (బీఎస్పీ)కి మాత్రం నా ఓటు ఎప్పటికీ చెందదంటూ' ఉద్వేగానికి లోనయ్యారు. దీనిపై అఖిలేశ్ స్పందిస్తూ.. సమాజ్ వాదీ పార్టీకి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు అఖిలేశ్. రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా 1993 నుంచి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతాప్‌ఘడ్ లోని కుండా నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతున్న విషయం తెలిసిందే.