యువ సంగీత దర్శకుడి రికార్డ్
సినీ రంగంలో ఏ కళాకారుడికైనా 50 సినిమాలు పూర్తిచేయటం అన్నది అరుదైన ఘనతే, అలాంటి అరుదైన రికార్డ్‌ను అత్యంత వేగంగా అందుకున్న యువ సంగీతదర్శకుడు సాయి కార్తీక్. ప్రస్తుతం టాలీవుడ్లో జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న సంగీత దర్శకుల్లో సాయికార్తీక్ ముందున్నాడు. స్టార్ మ్యుజీషియన్స్‌తో సినిమా చేయించాలంటే భారీగా రెమ్యూనరేషన్లు ఇచ్చుకోవాలి. అలా చేయలేని మీడియం బడ్జెట్ నిర్మాతలకు సాయి కార్తీక్ బెస్ట్ ఆప్షన్లా కనిపిస్తున్నాడు.
2008లో అబ్బో ఆడవాళ్లు అనే చిన్న సినిమాతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి కార్తీక్, బ్రేక్ కోసం చాలాకాలం పాటు ఎదురుచూశాడు. ఓం 3డి సినిమాతో తొలిసారిగా స్టార్ హీరో సినిమాకు సంగీతం అందించే అవకాశాన్ని సొంతం చేసుకున్న సాయి కార్తీక్, పటాస్ సినిమాతో మెమరబుల్ హిట్ అందుకున్నాడు. పైసా, ప్రతినిధి, రౌడీ లాంటి సినిమాలతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
తన పాటలతో కన్నా నేపథ్య సంగీతంతో ఆకట్టుకుంటున్నాడు సాయి కార్తీక్. రేసీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమా మూడ్‌ను ఎలివేట్ చేస్తూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. తాజాగా నారా రోహిత్, నందమూరి తారకరత్న లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన రాజా చెయ్యివేస్తే సాయి కార్తీక్‌కు 50వ చిత్రం. అతడి కెరీర్లో మైల్ స్టోన్ లాంటి ఈ సినిమా ఆడియో శుక్రవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పలువురు సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదలైంది.