లంచం..కలకలం
► మంత్రి సరోజ ఓ లంచగొండి
► నాలుగేళ్లలో రూ.4వేల కోట్ల లక్ష్యంగా ముడుపులు
► బదిలీకి రూ.30 లక్షల డిమాండ్
► పోలీసు కమిషనర్‌కు శిశుసంక్షేమశాఖ అధికారిణి ఫిర్యాదు
► రక్షణ కల్పించాలంటూ వేడుకోలు
ఆమె ఓ సాధారణ స్థాయి అధికారిణి. లంచం విషయంలో చిర్రెత్తిపోయారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రిపైనే గురువారం పోలీస్ కమిషనర్‌కుఫిర్యాదు చేశారు.నాలుగేళ్లలో రూ.4 వేల కోట్ల ముడుపులు లక్ష్యంగా మంత్రికి సహకరించాలని కోరారని, తన బదిలీకి రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేశారని తెలిపారు. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ధర్మపురి జిల్లా శిశుసంక్షేమ శాఖాధికారిణిగా పనిచేస్తున్న రాజామీనాక్షి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సరోజపై సంచలన ఆరోపణలు చేశారు. శిశుసంక్షేమ శాఖాధికారిణిగా కొనసాగాలంటే రూ.30 లక్షలు లంచంగా ఇవ్వాలని మంత్రి తనను డిమాండ్ చేసినట్లు రాజకీయాల్లో కలకలం రేపారు. ఈనెల 7వ తేదీన చెన్నైలోని తన ఇంటికి రప్పించుకుని బెదిరించినట్లు ఆరోపించారు.
చెప్పిన మాట వినకుంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందనే భయంతో బైటకు వచ్చేసినట్లు ఆమె తెలిపారు. ధర్మపురి జిల్లాలో మీడియాకు ఈ విషయాలు వివరించి చెన్నైకి చేరుకున్నారు. గురువారం ఉదయం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చి మంత్రి సరోజపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. లంచం అడిగి, బెదిరింపులకు గురిచేసిన మంత్రి సరోజపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులోని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ధర్మపురి జిల్లా శిశుసంక్షేమశాఖలో భద్రతాధికారిణిగా తనను జయలలిత స్వయంగా నియమించారు. విధుల్లో నేను ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాను. అయితే జయలలిత మరణం తరువాత ఆ బాధ్యతల్లో నన్ను సరిగా పనిచేయనీయలేదు. మంత్రి సరోజ వల్ల తరచూ ఒత్తిడికి గురవుతున్నాను. ఈ విధులకు రూ.10లక్షలు తీసుకుని ఉత్తర్వులు ఇస్తానని చెబుతున్నారు. మంత్రి భర్త సైతం బెదిరింపులకు గురిచేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.10లక్షలు చెల్లించాను. అనారోగ్య కారణాలు, బిడ్డ పెంపకం కోసం చెన్నైలోనే ఉండి విధులు నిర్వర్తించేలా బదిలీ చేయాల్సిందిగా మంత్రికి వినతిపత్రం సమర్పించాను.
ఈ వినతిపై మాట్లాడేందుకు రావాలని నన్ను మంత్రి ఇంటికి పిలిపించుకున్నారు. శాఖాపరమైన రికార్డులతో ఈనెల 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు చెన్నైలో మంత్రి ఇంట్లో కలువగా, ‘చెన్నైకి బదిలీ కోరుతూ నీ వినతిని పరిశీలించాను, బదిలీ చేయాలంటే రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది, ఇక నీకు అండగా నిలిచేవారు ఎవరూ లేరు, ఈ నాలుగేళ్లలో కనీసం రూ.4వేల కోట్లు సంపాదించాల్సి ఉంటుంది, వీలైతే ప్రస్తుత రేటు రూ.30లక్షలు ఇవ్వు, లేకుంటే అదే మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారికి నీ బాధ్యతలు అప్పగిస్తాను.
ఈ ఆదేశాలను ధిక్కరించినా, లంచం విషయం బైట చెప్పినా నీ ఉద్యోగం ఊడగొట్టడంతోపాటు నిన్నుæ నామరూపాలు లేకుండా చేస్తాను’ అని మంత్రి బెదిరించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి వల్ల తరచూ వేధింపులకు గురవుతూ విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నానని వాపోయారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని కలగకుండా రక్షణ కల్పించా లని కమిషనర్‌ను వేడుకున్నారు. కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించిన అనంతరం ఆమె మీడియాకు వివరించారు.
విపక్షాల విమర్శల వెల్లువ:
లంచం కోసం అధికారిణిని బెదిరించిన మంత్రి సరోజపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. అక్రమార్జనలో మంత్రి విచ్చలవిడి తనం బట్టబయలైందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. మంత్రి వర్గం నుంచి సరోజను బర్తరఫ్ చేయాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రజలు పలు సమస్యలు, కనీసం తాగునీరు కూడాలేక అల్లాడుతుండగా అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతిపైనే పూర్తిస్థాయి దృష్టిపెట్టిందన్న తన ఆరోపణలు సరోజ రూపంలో రుజువయ్యాయని ఆయన అన్నారు. మంత్రి సుజాతపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ డిమాండ్ చేశారు.