Raja Ritwick
-
సత్తా చాటిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చెస్ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ తన కెరీర్లో మరో అంతర్జాతీయ టోర్నీ టైటిల్‌ను సాధించాడు. స్పెయిన్‌లో జరిగిన సన్వే సిట్‌గెస్ ఓపెన్ అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల రాజా రిత్విక్ చాంపియన్‌గా అవతరించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత రాజా రిత్విక్ 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 30 దేశాల నుంచి 120 మంది అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో రిత్విక్ అజేయంగా నిలిచాడు. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థి అయిన రిత్విక్ ఈ టోర్నీలో ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రముఖ కోచ్ ఎన్.రామరాజుకు చెందిన రేస్ చెస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న రిత్విక్... ఈ టోరీ్నలో ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు ఆధిబన్, అరవింద్ చిదంబరం (భారత్), స్వెన్ ఫ్రెడరిక్ (జర్మనీ)పై గెలిచి మరో గ్రాండ్‌మాస్టర్ అర్జున్ కల్యాణ్ (భారత్)తో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. -
రాజా రిత్విక్‌కు తొలి జీఎం నార్మ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చెస్ క్రీడాకారుడు, ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) రాజా రిత్విక్ తన ప్రొఫెషనల్ కెరీర్లో మరో ముందడుగు వేశాడు. గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా సాధించే దిశగా 15 ఏళ్ల రాజా రిత్విక్ సాగుతున్నాడు. స్పెయిన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఎలోబ్రెగట్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో మెరుగ్గా రాణించిన రాజా రిత్విక్ తొలి జీఎం నార్మ్‌ను అందుకున్నాడు. ఈ టోర్నమెంట్లో నిర్ణీత తొమ్మిది రౌండ్ల అనంతరం మూడు విజయాలు, ఆరు ‘డ్రా’లు నమోదు చేసి 6 పాయింట్లతో అతను 16వ స్థానాన్ని దక్కించుకున్నాడు. టోర్నీలో భాగంగా తనకన్నా ఎంతో మెరుగైన క్రీడాకారులతో తలపడిన రిత్విక్ అజేయంగా నిలిచి 26 రేటింగ్ పాయింట్లను సాధించాడు. దీంతో అతని ఖాతాలో ప్రస్తుతం 2407 రేటింగ్ పాయింట్లతో పాటు తొలి జీఎం నార్మ్ వచ్చి చేరింది. ఇందులో ఆరుగురు గ్రాండ్మాస్టర్లతో ఆడిన రిత్విక్ ఒకరిని ఓడించి మరో ఐదుగురితో తన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. తొలి గేమ్‌లో కొరిజే లిలీ (జార్జియా)పై, రెండో గేమ్‌లో గ్రాండ్‌మాస్టర్ నర్సిసో డుబ్లాన్ మార్క్ (స్పెయిన్)పై, నాలుగో గేమ్‌లో ఐఎం సోసా టోమస్ (అర్జెంటీనా)పై గెలుపొందిన రిత్విక్... జీఎం అరిజ్మెండి మార్టినెజ్ జులెన్ లూయిస్ (స్పెయిన్; మూడో గేమ్), జీఎం అలొన్సో రోసెల్ అల్వర్ (స్పెయిన్; ఐదో గేమ్), ఐఎం జనన్ ఎవినీ (స్పెయిన్; ఆరో గేమ్), జీఎం కార్తీక్ వెంకటరామన్ (భారత్; ఏడో గేమ్), జీఎం గుకేశ్ (భారత్; ఎనిమిదో గేమ్), ఏంజెలిస్ సాల్వడర్ (స్పెయిన్; తొమ్మిదో గేమ్)లతో ‘డ్రా’ చేసుకున్నాడు. -
జాతీయ అండర్–13 చెస్ చాంప్ రిత్విక్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ అండర్–13 చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ రాజా రిత్విక్ విజేతగా నిలిచాడు. పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన ఈ టోర్నీలో క్యాండిడేట్ మాస్టర్ (సీఎం) హోదా ఉన్న రిత్విక్ నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ కుశాగ్ర మోహన్ 8.5 పాయింట్లు సంపాదించి రన్నరప్‌గా నిలిచాడు. మొత్తం 11 గేమ్‌లు ఆడిన రిత్విక్ ఎనిమిది గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. ఈ విజయంతో రాజా రిత్విక్ త్వరలో జరిగే ఆసియా యూత్, ప్రపంచ యూత్, కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.