గుసగుసలు
పలమనేరు టీడీపీ అభ్యర్థిగా మంత్రి గల్లా
చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
బోసు వర్గంలో భయం
పలమనేరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ శాసనసభ అభ్యర్థిగా పోటీలో ఉండేందుకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించలేదు. తానుఇంకా టీడీపీలోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మంత్రి గల్లా అరుణకుమారి గత ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నారు. చంద్రబాబుతో గల్లా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇటీవల జయదేవ్ తమ ఫ్యాక్టరీ వద్ద సహచరులు, అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసి ‘‘మా అమ్మకు ఎలాగైనా టీడీపీలో సీటు సంపాదించాలి. మా అమ్మను అభిమానించే కాంగ్రెస్, టీడీపీ వారంతా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు రావాలి’’ అని కోరారు. దీంతో మంత్రి గల్లా అనుయాయుల నుంచి కూడా చంద్రబాబుపై వత్తిడి పెరిగినట్లు సమాచారం.
చంద్రగిరిలో కష్టమనే...
చంద్రగిరి నుంచి పోటీచేస్తే గెలుపు కష్టమని, వైఎస్ఆర్ సీపీ నుంచి తీవ్రస్థాయిలో పోటీ ఉంటుందనే భావనతోనే చంద్రగిరి కాకుండా పలమనేరును ఎంచుకున్నట్లు సమాచారం. పలమనేరు నియోజకవర్గంలోకి పునర్విభజన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని వీ.కోట మండలం రావడంతో ఈ మండలం నుంచి వచ్చే ఓట్లు చంద్రబాబు నాయుడి అభిమానులవేనని ఆమె నమ్ముతున్నారు. పైగా ఆమె తండ్రి రాజగోపాల్‌నాయుడు కూడా పార్లమెంటుకు గతంలో ప్రాతినిథ్యం వహించడంతో ఇదీ తనకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఆమె పలమనేరు నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని తెలిసింది. అయితే చంద్రబాబు తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది తెలియాలి. త్వరలో గుంటూరులో జరిగే టీడీపీ మీటింగ్‌లో గల్లా అరుణకుమారితో పాటు ఆమె తనయుడు జయదేవ్కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిసింది.
బోస్ వర్గంలో భయం
పలమనేరు టీడీపీ టికెట్ కోరుకుంటున్న సుభాష్‌చంద్రబోస్ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో గల్లాకు టిక్కెట్ ఇస్తారనే విషయం పలమనేరులో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీలో ఈమెకు టికెట్ ఇస్తారో లేదో గానీ బోస్ వర్గానికి మాత్రం ఈ విషయం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.రేసులో బోస్‌తో పాటు మరో ఆరుగురు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బోస్ మాత్రమే అన్ని మండలాల్లోనూ ఇప్పటికే ప్రచారం సైతం చేసుకెళ్తున్నారు.