కల్పవృక్షమెక్కి..కరుణించిన తల్లి
తిరుచానూరు, న్యూస్‌లైన్: పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజైన సోమవారం ఉదయం రాజగోపాలుని అలంకరణలో అమ్మవారు కోర్కెలను తీర్చే కల్పవృక్ష వాహనంపై తిరువీధు ల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువనే 4 గంటలకు సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7గంటలకు అమ్మవారిని ఆలయంలోని అద్దాలమండపం నుంచి వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి అక్కడే సిద్ధంగా ఉంచిన కల్పవృక్షవాహనంపై కొలువుదీర్చారు.
అనంతరం అమ్మవారిని పట్టుపీతాంబర, స్వర్ణాభరణాలతో పాటు ఎడమ చేతిలో రాజదండం, కుడి చేతిలో చర్నాకోల చేతబట్టి గోవుల ను పాలించే రాజగోపాలునిగా అలంకరించారు. అనంతరం 8గంటలకు జియ్యర్ల ప్రబంధ పారాయణం, మంగళ వాయిద్యాలు, చిన్నారుల కోలాటం, దాససాహితీ భజన బృందం, కళాకారుల నృత్య ప్రదర్శన, భక్తుల గోవింద నామ స్మరణ నడుమ అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు.
రాత్రి అమ్మవారు హనుమంత వాహనంపై రాముని అవతారంలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ వాహనసేవల్లో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, ఏఈవో నాగరత్న పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి మంగళవారం వసంతోత్సవం నిర్వహించనున్నారు.