Rajagopuram
-
యాదాద్రి రాజగోపురానికి బంగారు తాపడం
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం బంగారు తాపడం పనులకు మోక్షం కలగనుంది. సుమారు 60 కేజీల బంగారంతో తాపడం పనులను చేపట్టనున్నారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని సంకల్పించారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ, ఉన్నతస్థాయి అధికారులు జరిపిన సమీక్షా సమావేశాల్లో యాదాద్రి ఆలయ రాజగోపురానికి బంగారు తాపడంపై చర్చించిన విషయం తెలిసిందే. బంగారు తాపడం పనులను దాతలు ఇచ్చిన విరాళాలు, దేవస్థానం నిధులతో చేయనున్నారు. ఇప్పటికే దాతలు ఇచ్చిన నగదు సుమారు రూ.25 కోట్లు నగదు, 11 కిలోల బంగారం దేవస్థానం వద్ద ఉంది. దేవస్థానం హుండీలో భక్తులు సమర్పించిన బంగారం, వెండిని మింట్‌కు పంపించి ప్యూర్ గోల్డ్ (24 క్యారెట్లు)గా మార్చనున్నారు.అయితే భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారాన్ని ప్యూర్ గోల్డ్‌గా మార్చడం, వెండి ఆభరణాలను కరిగించి అందుకు సమానమైన సుమారు 25 కిలోల బంగారాన్ని మింట్ ద్వారా తీసుకోనున్నారు. రాజగోపురానికి 10,500 చదరపు అడుగుల మేరకు బంగారు తాపడం పనులకు అంచనా వేశారు. పనులు చేయడానికి రూ.6 కోట్లు మేకింగ్ చార్జీలు అవసరం అవుతాయని అంచనా వేశారు. గ్లోబల్ టెండర్ల ద్వారా బంగారు తాపడం తయారు పనులను అప్పగించనున్నారు. సీఎం ఆమోదం పొందగానే పనులు: ఆలయ ఈవో భాస్కర్‌రావు బంగారు తాపడం పనుల ఆమోదం ఫైలు సీఎంవోలో ఉంది. దేవాదాయ శాఖ నుంచి సీఎంకు ఫైల్ పంపించారు. సీఎం ఆమోదం లభించగానే పనులు ప్రారంభిస్తాం. స్వర్ణ తాపడం పనుల కోసం అవసరమైన ఖర్చును దేవస్థానం భరిస్తుంది. -
ఐదు దర్వాజల్లో నుంచి సూర్యోదయం, ఎక్కడంటే?
సాక్షి, జడ్చర్ల టౌన్: ఆలయ నిర్మాణాల్లో శిల్పులు తమ ప్రత్యేకతకు చాటుకోవటం పరిపాటి. అలాంటి కోవలోనే 44వ నంబరు జాతీయ రహదారిపై జడ్చర్ల మండలం గొల్లపల్లి వద్ద ఉన్న లలితాంబికా తపోవనం రాజగోపురం నిలుస్తోంది. దీనికి ఐదు గవాక్షాలు ఉండగా సూర్యుడు ఉదయించే సమయంలో వాటిల్లోనే పయనించడం విశేషం. ఆదివారం కనిపించిన సుందర దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. సాధారణంగా భక్తులు గవాక్షాలను అంతస్తులుగా పిలుస్తారు. ఒక్కో గవాక్షం ఒక్కో అంతస్తుగా, గవాక్షాన్ని దర్వాజగా భావిస్తారు. ఆ దర్వాజలో నుంచే సూర్యోదయం జరగటాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. చదవండి: అరే ఏంట్రా ఇది.. అలా తాగేస్తున్నారు! -
రాజగోపురం పనులు వేగవంతం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి ఆలయ రాజగోపుర పునర్మిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. ఇప్పటికే 112 అడగుల ఎత్తు వరకు పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో జరిగే కుంభాభిషేకం లోపు పూర్తి చేసి నాటి రాజసాన్ని నిలిపేందుకు దేవస్థానం కసరత్తు చేస్తుండగా,భక్తులను అలనాటి జ్ఞాపకాలలోకి నెట్టేస్తోంది. శ్రీకృష్ణదేవరాయులు గజపతులపై విజయం సాధించిన సందర్భంగా 1516లో ఆలయం పక్కనే 120 అడుగుల రాజగోపురాన్ని నిర్మించారు. 2010లో గోపురం కుప్పకూలింది. గోపురాన్ని ఉచితంగా నిర్మించేందుకు నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ ముందుకు వచ్చింది. 2010, ఆగస్టు 29న అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా, స్థల సేకరణలో అడ్డంకులు రావడంతో పనుల్లో తీవ్ర ఆలస్యం చోటు చేసుకుంది. అవాంతరాలను అధిగమించి ఏడాదిగా పనులను దేవస్థానం వేగవంతం చేసింది. 140 అడుగుల గోపుర నిర్మాణంలో ప్రస్తుతం 112 అడుగులు పూర్తి అయింది. ఫిబ్రవరి 8వ తేదీన జరిగే ఆలయ మహాకుంభాభిషేకం లోపే పనులు పూర్తి చేసేందుకు దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. -
యాదాద్రికి 8 రాజగోపురాలు
యాదాద్రి (నల్లగొండ) : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలోని యాదాద్రి ఆలయం 8 రాజగోపురాలతో అందంగా తయారుకానుంది. ఈ ఆలయం సుమారు రెండున్నర ఎకరాల్లో రూపుదిద్దుకోనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పిల్లర్ల పనులు మొదలయ్యాయి. శివాలయం ఎదుట 150 అడుగుల ఆంజనేయ స్వామి కంచు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహం బెంగళూరులో తయారవుతున్నట్లు సమాచారం. ఆలయం చుట్టూ రిటైనింగ్ వాల్, తిరుమాడ వీధులు ఉంటాయి. రాజగోపురాలపై ప్రత్యేక శిల్పాలను చెక్కిస్తున్నారు. ఈ శిల్పాలు తయారు చేయడం కోసం ప్రత్యేక కళాకారులను ఆహ్వానించారు. వచ్చే వందేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండాలనే లక్ష్యంతో నిర్మిస్తున్నారు. ఆర్కిటెక్టులు, స్థపతులు, శిల్పకళాకారులు, అనుభవం కలిగిన ఇంజనీర్లు నిర్మాణ రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు.