టీటీడీ సీవీఎస్వో పోస్టు భర్తీ అయ్యేనా?
సాక్షి, తిరుమల: తిరుమలలో భద్రత చర్యలపరంగా అత్యంత కీలకమైన టీటీడీ సీవీఎస్వో పోస్టు ఖాళీగానే ఉంది. ఈనెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా నెలన్నర నుంచి ఖాళీగా ఉన్న ఈ పోస్టును భర్తీ చేయడంపై ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్వో) పోస్టు నెలన్నర రోజులుగా ఖాళీగా ఉంది. ఇక్కడ ఉన్న సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాస్‌ను చిత్తూరు ఎస్పీగా జూలై 16వ తేదీన బదిలీ చేశారు. టీటీడీకి మాత్రం కొత్త అధికారిని నియమించలేదు. ప్రస్తుతం బదిలీ అయిన
ఘట్టమనేని శ్రీనివాస్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు.
గతంలో కూడా ఇక్కడ సీవీఎస్వోగా పనిచేసిన జీవీజీ అశోక్‌కుమార్ వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆ తర్వాత సుమారు నాలుగు నెలలపాటు ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఖాళీగానే ఉంచారు. తీవ్ర విమర్శలు రావడంతో వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా పగ్గాలు చేపట్టిన జీవీజీ అశోక్కుమార్కే అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆ తర్వాత తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబుకు ఇన్చార్జిగా అప్పగించారు.
ఇలా ఐపీఎస్ అధికారులు మారిన ప్రతి సందర్భంలోనూ టీటీడీ సీవీఎస్వో పోస్టు ఖాళీగా ఉంచటం, ఇన్చార్జిల పాలనలో అదనపు బాధ్యతలు చూస్తుండటం సంప్రదాయంగా మారింది. దీనివల్ల భద్రతా పరమైన పరిపాలన కుంటుపడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈనెల 26 నుంచి అక్టోబరు 4 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భద్రతను పర్యవేక్షించే అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో విజిలెన్స్ విభాగం పాలన నత్తనడకన సాగుతోంది.
తిరుమల భద్రత పట్టదా?
దేశంలో ఉగ్రవాద దుశ్చర్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తిరుమలలోని ఆలయ భద్రతపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల తీవ్ర హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఆలయంతోపాటు రోజుకు దాదాపుగా లక్ష మంది దాకా వచ్చే భక్తులకు పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం టీటీడీపై ఉంది. గత ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా గొడుగుల ఊరేగింపు సందర్భంగా తిరుపతికి 35 కిలోమీటర్ల దూరంలోని పుత్తూరు వద్ద కరుడుగట్టిన ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకున్న విషయం తెలిసిందే.
కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన తిరుమల ఆలయ భద్రత, పర్యవేక్షణ, పరిపాలన సంబంధిత విషయాలను ఎప్పటికప్పడు పర్యవేక్షించేందుకు ఎస్పీ స్థాయి కలిగిన భద్రతాధికారి అవసరం. అయితే, ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు బాస్‌లు పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.