పిల్లలపై దాడి, నగ్నంగా ఊరేగింపు
జైపూర్ : రాజస్థాన్ లో ముగ్గురు దళిత బాలురను నగ్నంగా ఊరేగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోటార్ సైకిల్ దొంగిలించాడనే ఆరోపణలతో వీరిపై అగ్రకులానికి చెందిన వ్యక్తులు తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. చిత్తోర్ ఘడ్ లోని బస్సీ గ్రామంలో ఈ భయంకరమైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. మరోవైపు నిందితులపై ఎలాంటి చర్య చేపట్టని పోలీసులు, బాధితులపై కేసు నమోదు చేసి, జువైనల్ హోంకు తరలించడం వివాదాన్ని రేపింది.
వివరాల్లోకి వెళితే అగ్రకులానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారని ఆరోపిస్తూ ముగ్గురు పిల్లలను మండుటెండలో ఓ చెట్టుకు కట్టేసి, విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో వారి ప్రకోపం చల్లారలేదు. 42 డిగ్రీల ఎండలో నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. బాధతో బాధితులు హాహాకారాలు చేసినా, వదిలిపెట్టమని వేడుకున్నా కనికరించలేదు. వారి ఆగడాలతో చుట్టూ ఉన్న ప్రజలు కూడా ప్రేక్షకుల్లా మిగిలిపోయారు. సుమారు గంటసేపు ఈ తతంగం నడిచింది.
ఒక గంట తర్వాత వచ్చిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...పిల్లలను విడిపించి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బైక్ దొంగతనం కేసులో బాలురను అరెస్టు చేశారు. విచారణ సమయంలో బైక్ దొంగిలించినట్టుగా అంగీకరించారని, బైక్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికారి గజ్ సింగ్ తెలిపారు. అటు దాడి ఘటనలో అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.