ఒక వెచ్చటి ఆంగ్ల ఉత్సవం...
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్
జైపూర్ దిగ్గీ ప్యాలెస్ దిగ్గున వెలిగింది. రాజస్తానీ ఫోక్, మసాలా చాయ్, రోటీ- చోలే భతూరేల మధ్య వేదికలు వెచ్చగా మాటలని పంచుకున్నాయి. పుస్తకాలను ఎంచుకున్నాయి. అభిప్రాయాలను ఖండించుకున్నాయి. ఏనాటి జ్ఞాపకాలనో వెలికి తీసి కంఠాలను గద్గద పరుచుకున్నాయి. వేదిక బాగుంది. ముసురు బాగుంది. పొగమంచు బాగుంది. జివ్వున కోసే చలిగాలి బాగుంది. మనిషికీ మనిషికీ మధ్య ఎడం లేనంత కిక్కిరిసిన సమూహాల మధ్య సాహిత్యం తప్ప మరో ఊసు లేకుండా జనవరి 21- 25 తేదీల మధ్య ఐదు రోజులు గడవడం బాగుంది. అయితే బాగోలేనిదీ ఉంది. తొలిసారి తెలుగు మీడియా నుంచి సాక్షి సాహిత్యానికి ప్రత్యేక ఆహ్వానం అందిన దరిమిలా ఈ ఉత్సవంపై స్పెషల్ రిపోర్ట్.
అమెరికన్లు, జర్మన్లు, రోమన్లు, ఇటాలియన్లు, ఆసియన్లు, ఇండియన్ అమెరికన్లు వీళ్లంతా హాలీవుడ్లో సినిమాలు తీసి ఆ సినిమాలతో ఒక ఉత్సవం జరుపుకుంటే అదెలా ప్రపంచ సినిమాకు ప్రాతినిధ్యం వహించదో ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ కూడా ‘భారతీయ సాహిత్యం’కు ప్రాతినిధ్యం వహించదు. అవును.
బహుశా- దక్షిణాసియాలోనే అతి పెద్ద ‘సాహితీ తీర్థయాత్రాస్థలి’గా గత ఏడేళ్లల్లో పలుకుబడిని పెంచుకున్న జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ప్రధానంగా ఇంగ్లిష్ భాషను ఉద్దేశించినది. ఇంగ్లిష్ వలన, ఇంగ్లిష్ కొరకు, ఇంగ్లిష్ చేత... ఇంగ్లిష్ మార్కెట్‌ను ఉత్సాహ పరచడానికి ఇది చేస్తున్న ప్రచారం సామాన్యం ఏమీ కాదు. అంతమాత్రం చేత ‘స్థానిక’ లేదా ‘దేశీయ’ సాహిత్యం దాని ప్రాధాన్యంలో లేదన్న సంగతీ విస్మరణీయం కాదు. ఈ ఉత్సవం జరిగినన్ని రోజులూ ఒకటే మాట.
చలో ఔర్ కుచ్ లిఖో. లేకిన్ ఇంగ్లిష్ మే.
ఈ ముక్క చెప్పడానికి లండన్ నుంచి నోబెల్ గ్రహీత వి.ఎస్.నయిపాల్ వచ్చాడు. గుండుకు కూడా దొరకడని పేరు గడించిన ప్రసిద్ధ ఇంగ్లిష్ నవలాకారుడు, సినీ రచయిత హనీఫ్ ఖురేషీ వచ్చాడు. జె.డి.శాలింజర్ (‘శాలింగర్’ కాదట) సెక్రటరీకి సెక్రటరీగా చేరి శాలింగర్కు అభిమానులు రాసే ఉత్తరాల జవాబు పని చూసి ఆ ఉత్తరాల తలపోతను మర్చిపోలేక 1996నాటి న్యూయార్క్ సాహితీ దిగ్గజాలను తలచుకుంటూ ఇటీవలే ‘మై శాలింజర్ ఇయర్స్’ అనే నవల రాసి పేరు తెచ్చుకున్న రచయిత్రి జొయాన్నా రేకాఫ్ అమెరికా నుంచి వచ్చింది. విస్తృతమైన ట్రావెల్ రైటర్‌గా పేరు పొంది ‘ది గ్రేట్ రైల్వే బజార్’ వంటి విఖ్యాత ట్రావెలోగ్ రాసిన పాల్ థొరో వచ్చాడు. ఇంకా అనేక దేశాల రచయితలు దిగబడ్డారు. మన దగ్గర నుంచైతే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్తో మొదలు అశోక్ వాజ్పాయ్, శోభా డే, ‘తారే జమీన్ పర్’ ప్రసూన్ జోషీ, ఆకార్ పటేల్, బషారత్ పీర్... అనేకులు. అందరూ ఒక కుటుంబంలాగా. ఒకే కప్పు కింద.
బ్రేక్‌ఫాస్ట్ సమయానికి నసీరుద్దీన్ షా, గిరిష్ కర్నాడ్‌లు తారసపడొచ్చు. లంచ్‌లో వెనుక ప్లేట్ అందుకుంటున్నది వార్ కరస్పాండెంట్ స్కాట్ ఆండర్సన్ కావచ్చు. ఆ మూలన వైన్ కౌంటర్ దగ్గర నిలుచున్న అమ్మాయి మనం ఎన్నిసార్లు మెయిల్ పెట్టినా రెస్పాండ్ కాని పెంగ్విన్ రాండమ్హౌస్ పబ్లిషర్ చికి సర్కార్ కావచ్చు. డిన్నర్ సమయానికి వినిపిస్తున్న గజల్ జావేద్ అక్తర్ గొంతెత్తి పాడేది అయి ఉండొచ్చు. ఇది చాలనట్టు వచ్చేపోయే అతిథులు... శశిథరూర్, రామ్ జెఠ్మలానీ, ఆజ్ ఫిర్ జీనేకీ తమన్నాహై- వహీదా రెహమాన్, షబానా ఆజ్మీ, రాజ్‌దీప్ సర్దేశాయ్, నన్నొదలద్దన్నట్టు చేతన్ భగత్....
వీళ్లందరినీ ఇలాంటి దిగ్గజాలందరినీ ఒకచోట చేర్చడమే జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ఘనత. మనుషులు సాధారణంగా ఒకరినొకరు కలవడానికి ఇష్టపడతారు. అందునా, ఒకే అభిరుచి ఉన్నవారిని, పుస్తకాల పురుగులని ప్రపంచపు నలుమూలల నుంచి తెచ్చి కలిపితే? అందుకే ఈ ఆవురావురు.
ఆ ముగ్గురు....
నమితా గోఖలే అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె ఇంగ్లిష్‌లో రాస్తుంది. పురాణ కథలను రీటెల్లింగ్ చేయడం ద్వారా గుర్తింపు పొందింది. పబ్లిషర్‌గా ‘నమితా గోఖలే ఎడిషన్స్’ పేరుతో తెచ్చే పుస్తకాలకు గౌరవం ఉంది. వీటన్నింటికీ మించి భారీ సాహితీ ఉత్సవాలు నిర్వహించడంలో ఆమెకు అనుభవం ఉంది. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ఆమె ఆలోచన. ఆమెకు మరో ఇద్దరు తోడు నిలిచారు. ఒకడు- ప్రసిద్ధ బ్రిటిష్ చరిత్రకారుడూ ఆ దేశం కన్నా మన దేశం మీద ‘ది ఏజ్ ఆఫ్ కలి’, ‘ది వైట్ మొఘల్స్’, ‘ది లాస్ట్ మొఘల్’ వంటి పుస్తకాలు రాసిన విలియమ్ డాల్రింపల్. మరొకడు- మన దేశంలో మెగా ఈవెంట్స్ చేసే ‘టీమ్ వర్క్స్’ సంస్థ వ్యవస్థాపకుడు, కాలమిస్ట్ సంజయ్రాయ్.
వీరే ప్రతి ఏటా ఈ ఉత్సవం రూపురేఖలనీ, చర్చించవలసిన అంశాలనీ, ఆహ్వానించాల్సిన అతిథులని ఖరారు చేస్తారు. తగిన అనుమతి లేకుండా చీమ కూడా దూరలేదు. ప్రాంతీయ మీడియా అంటే వీళ్లకు లెక్కే లేదు. ఈసారే దక్షిణాది భాషలకు ఆహ్వానం పంపారు. ఫండ్స్ బాగా వచ్చి ఉండొచ్చు. లేదా ఇది మరింతగా విస్తరించి ఉండొచ్చు. విడిగా పాల్గొనాలనే ఉత్సాహం ఉందా? ఐదురోజుల ప్రవేశ రుసుమూ, బస, రాకపోకలూ, ఇతర ఖర్చులూ... యాభై వేలు సిద్ధం చేసుకోవాలి.
బ్రిటిష్ ఎయిర్వేస్ బైఠక్....
గూగుల్ ఒక వేదికను స్పాన్సర్ చేసింది. బ్రిటిష్ ఎయిర్వేస్ మరో వేదికను. ఫోర్డ్ ఇలాంటి చాన్స్ వదులుకోదు. మహింద్రా గ్రూప్ ఒకటి. ‘రజనీగంధ’ పాన్‌మసాలా కూడా. విశాలమైన దిగ్గీ ప్యాలెస్‌లో ఐదు చోట్ల ఉన్న ఈ ఐదు వేదికల మీద ఐదురోజుల పాటు జరిగిన దాదాపు 200 సాహితీ కార్యక్రమాల్లో ఎక్కువగా చర్చకు గురైన అంశాలు ఏమిటి? ఎక్కువగా మార్కెట్లో, ప్రచారంలో ఉన్న పుస్తకాలే.
నయిపాల్ నవల ‘ఏ హౌస్ ఆఫ్ మిస్టర్ బిస్వాస్’, తనూజా దేశాయ్ నవల ‘బార్న్ కన్ఫ్యూజ్డ్’, నసీరుద్దీన్‌షా ఆత్మకథ ‘అండ్ దెన్ ఒన్ డే’, వహీదా రెహమాన్ జ్ఞాపకాలు ‘ముఝే జీనే దో’, శశిథరూర్ ‘ఇండియా శాస్త్ర’, రామ్ జెఠ్మలానీ ‘ది డెవిల్స్ అడ్వొకేట్’, రాజ్‌దీప్ సర్దేశాయ్ ‘ద ఎలక్షన్ దట్ ఛేంజ్డ్ ఇండియా’.... అయితే ఈసారి ముఖ్యంగా గమనించవలసింది పురాణాల నుంచి కథలను ఇంగ్లిష్‌లోకి తెస్తున్నవారు, రీ-టెల్ చేస్తున్నవారు, కొత్త దృష్టికోణం నుంచి వ్యాఖ్యానం చేస్తున్నవారు, వాటిలోని పాత్రలతో దాదాపు కమర్షియల్ సాహిత్యాన్ని సృష్టిస్తున్నవారు సీరియస్ సృజనకారుల స్థాయిలో తారసిల్లడం. ‘శివ ట్రయాలజీ’ రాసిన అమిష్ త్రిపాఠీ, మహాభారతాన్ని ఇంగ్లిష్‌లో అనువాదం చేసిన బిబేక్ దేబ్రాయ్, గ్రాఫిక్స్‌తో పురాణాలను వివరించే పనికి పూనుకుని చాలా పుస్తకాలు అమ్ముతున్న దేవ్‌దత్ పట్నాయక్ ఈ ఉత్సవంలో భుజాలు రాసుకుంటూ తిరిగారు. ఆఖరికి రామాయణ, భారతాలను పిల్లల కోసం రాస్తున్న ఆర్షియా సత్తార్లాంటి వాళ్లు కూడా అదొక ముఖ్య రచనార్హత కలిగినవారై కనిపిస్తారు. నిజానికి ఇంతకు మించిన ఉద్దండులు మనకు ఉన్నారు.
రాస్తారు. కాని, తెలుగులో.
ఈ విభాగం తర్వాత ఈ ఉత్సవం ప్రాముఖ్యం ఇచ్చింది ‘ట్రావెల్ రైటింగ్’నే. ఈ దేశంలోని ముఖ్యనగరాలు ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, లక్నో... వీటి మీద తలా ఒక పుస్తకం రాసేసిన మాళవికా సింగ్, ఇరాక్ (కువైట్) వార్ డైరీ రాసిన చార్లెస్ గ్లాస్, పులుల హతం తర్వాత శ్రీలంకలో తిరిగి అక్కడి పరిస్థితులను చెప్పిన సామంత్ సుబ్రమణియన్, ఇండియాను ‘స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ పారడైజ్’గా వర్ణిస్తూ పుస్తకం రాసిన బి.బి.సి రిపోర్టర్ శామ్ మిల్లర్, అంతరించి పోతున్న క్రిస్టియన్ మోనాస్ట్రీలను పర్యటించి ప్రస్తుతం వాటి మీద పుస్తకం రాస్తున్న విలియమ్ డాల్రింపల్.... ఇలాంటి వారంతా తమ ‘వాండర్లస్ట్’ను చెప్పడం ఈ ఉత్సవంలో ఒక ముఖ్యమైన సెషన్. రాయడం, తిరగడం రెండూ సృజనలో ఒక భాగం. రాస్తూ తిరగడం, తిరిగింది రాయడం.... తెలుగులో ట్రావెల్ రైటింగ్ ఎంతమంది చేస్తున్నారు? ఆదినారాయణ, లోకేశ్వర్, అమరేంద్ర, భద్రుడు, కొండవీటి సత్యవతి... పది వేళ్లు మడవలేమా?
ఫైజ్... కైఫీ....
ఇంత పెద్ద దేశం... అందునా ఉత్తర భారతదేశం.... కాని హిందీ సాహిత్యం గురించి వినిపించింది తక్కువ. హిందీ మాట వినిపించింది కూడా అతి తక్కువ. ఈ బాధ మధ్య ‘క్లాసికల్ సాహిత్యా’న్ని ముఖ్యంగా భారతీయ క్లాసికల్ సాహిత్యాన్ని కాపాడుకోవలసిన అవసరాన్ని గురించిన ముఖ్యమైన చర్చ జరగడం ఒక ఓదార్పు. ఫైజ్, కైఫీ కవిత్వం గురించి చర్చ జరగడం మరో ఓదార్పు. ఐదారు భారతీయ భాషలను ఎంచి వాటి ప్రాచీన సాహిత్యపు పలుకును వినిపించడం మరో ఓదార్పు. తెలుగు నుంచి ఈ ఉత్సవానికి ఆహ్వానం అందుకున్న ఏకైక సాహితీవేత్త సి.మృణాళిని ఈ వేదికల మీద నుంచి ‘మనుచరిత్ర’ పద్యాలను పాడి వినిపించడం అతి పెద్ద ఓదార్పు.
ముందే చెప్పుకున్నట్టు ఇది ఇంగ్లిష్ ఉత్సవం. ఇంగ్లిష్‌లో రాసేవారి ఉత్సవం.
కన్నడ సాహిత్యం అంటే వీరి దృష్టిలో కుం.వీరభద్రప్ప, ఎస్.ఎల్.బైరప్పగాక ఇంగ్లిష్‌లో రాసే (ఎక్కువగా అనువాదమయ్యే) సుధామూర్తి అని తెలుసుకుంటే సరిపోతుంది. దక్షిణాది కవులంటే సచ్చిదానందన్, శివారెడ్డి, గోరటి వెంకన్నగాక ఇంగ్లిష్‌లో రాసే విజయ్ శేషాద్రి అని తెలుసుకున్నా సరిపోతుంది. ఇంగ్లిష్‌లో రాసే మలయాళ కవి జీత్ థాయిల్ కేరళ కొబ్బరిగాలుల వరకూ వీరి ప్రతినిధి. ప్రపంచభాష కావాలి వీరికి. భూగోళం మీద పరివ్యాప్తమైన భాష. పద. రాయీ. కాని ఇంగ్లిష్‌లో.
చివరకు మిగిలేది
ఏది ఇక్కడ కొనప్రాణంతో ఉందో అది ప్రపంచమంతా బతికి ఉంది. నవల! జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌కు సంబంధించినంత వరకూ రచయిత అంటే నవలా రచయిత. అందునా ఇంగ్లిష్‌లో రాసే నవలా రచయిత. కథ, కవిత్వం... ఓకే... ఆ మూల టేబుల్ మీద కూచో. దర్గామిట్ట కతలు, న్యూ బాంబే టైలర్స్... సరే సరే... ఆ పెట్‌బాటిల్ అందుకుని మంచినీళ్లు పుచ్చుకో. అంతే. అంతకు మించి ఏం లేదు.
మరి నవల రాయడం, ఇంగ్లిష్‌లో రాయడం... ఎంతమంది తెలుగు రచయితలు ఈ పనికి పూనుకోగలరు? అసలు తెలుగులోనే ఒక మంచి, గొప్ప నవలకు ఎంతమంది పూనుకోగలుగుతున్నారు. ఒక సరైన నవల- రాయగలిగి- దానిని ఇంగ్లిష్‌లో అనువాదం చేయించుకోగలిగి- అది సరైన పబ్లిషర్ ద్వారా పాఠకులకు అందగలిగి- గుర్తింపు పొందగలిగి- అప్పుడు జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అలాంటి రచయిత కోసం కాల్ చేస్తుంది. ఈ-మెయిల్ పంపుతుంది. ప్రపంచంలోని రచయితలందరి సరసనా కూచోపెట్టి రాజస్తానీ నేతవస్త్రం భుజాన కప్పి గౌరవిస్తుంది.
తెలుగులో రాయడం ఏ మాత్రం న్యూనత కాదు. కాని రాసింది ఇంగ్లిష్తో ముడిపడి ఉన్న ఆవలి ప్రపంచానికి చేర్చడమూ తప్పు కాదు.
మరి ఇక్కడ ఇంగ్లిష్‌లోకి వెళ్లడం చెడ్డ విలువగా ప్రచారం అయి ఉందా? రాసిన పుస్తకాన్ని ప్రచారం చేసుకోవడం చెడ్డ విలువగా స్థిరపడి ఉందా? రాసింది షెల్ఫ్‌లో పెట్టుకొని మంచి పుస్తకమైతే ఎలాగైనా బతుకుతుంది అనుకోవడం మంచి విలువగా ప్రచారం అయి ఉందా?
సరే. మీటింగ్స్ ఉంటాయిగా. అప్పుడప్పుడు ప్రెస్‌క్లబ్‌లో కలుస్తుందాం.
- ఖదీర్
తెలుగు నుంచి ఈ ఉత్సవానికి ఆహ్వానం అందుకున్న ఏకైక సాహితీవేత్త సి.మృణాళిని ఈ వేదికల మీద నుంచి ‘మనుచరిత్ర’ పద్యాలను పాడి వినిపించడం అతి పెద్ద ఓదార్పు.
ఎవరి ఇంట్లో అయినా పాలో కొయిలో పుస్తకం కనిపించిందంటే ఇక ఆ ఇంటి పెద్దతో మాట్లాడటం అనవసరమని నిశ్చయించుకుంటాను.
- ఆల్బెర్టో మాంగ్యుయల్
నేను రాసిందంతా ఇతరులు ఎలా రాశారో చూసి నేర్చుకుని రాసిందే. రచయిత అనే వాడు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి.
- వి.ఎస్. నయిపాల్