పది రోజుల్లో పంజాబీ..!
పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం కరీనా కపూర్‌కి చాలా సులువైన విషయం. అందుకు చాలా ఉదాహరణలున్నాయి. ఓ ఉదాహరణ ‘తషాన్’. ఆ చిత్రంలో స్టయిలిష్‌గా కనిపించడం కోసం జీరో సైజ్‌కి మారిపోయారు కరీనా. ఇప్పుడు ‘ఉడ్తా పంజాబీ’ చిత్రం కోసం పంజాబీ అమ్మాయిలా శారీరక భాషను మార్చుకుంటున్నారు. అలాగే, పంజాబీ భాష కూడా నేర్చుకుంటున్నారు. ముందుగా 30 రోజుల్లో పంజాబీ భాష నేర్చేసుకోవచ్చనే పుస్తకం మీద ఆమె ఆధారపడాలనుకున్నారట. కానీ, దానికి బదులు ఓ మంచి టీచర్ని నియమించుకుంటే బాగుంటుందని అనుకున్నారు.
దాంతో ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన రజత్ సింగ్ అనే ప్రొఫెసర్ దగ్గర పంజాబీ పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఈ పాఠాలు ఆరంభించకముందు తన స్నేహితులతో ‘చూస్తూ ఉండండి.. పది రోజుల్లో పంజాబీ భాష నేర్చేసుకుంటా’ అని సవాల్ కూడా విసిరారట. కరీనా అన్నంత పని చేస్తుందనీ, తనకంత ప్రతిభ ఉందని ఆ స్నేహితులు అంటున్నారు. ఆ సంగతలా ఉంచితే.. తన మాజీ ప్రియుడు షాహిద్ కపూర్ సరసన కరీనా ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ జంట తెరపై కనిపించి దాదాపు ఏడెనిమిదేళ్లవుతుంది. సో.. ఈ చిత్రానికి భారీ ఎత్తున క్రేజ్ ఏర్పడుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.