రాజీవ్ ఫోర్డ్ కారు సీజ్.. కీలక ఆధారాలు లభ్యం
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష, సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యల కేసులో రాజీవ్‌కు చెందిన ఫోర్డ్ కారును పోలీసులు గురువారం సీజ్ చేశారు. కారులో ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కుకునూర్‌పల్లిలో ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి, శిరీష, శ్రావణ్, రాజీవ్ లు ఒకేచోట ఉన్నట్లు కీలక ఆధారాలు సేకరించారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న శ్రావణ్, ఆర్జే ఫొటోగ్రఫీ స్టూడియో నిర్వాహకుడు రాజీవ్‌లను బుధవారం అర్ధరాత్రి వరకు విచారించినట్లు డీసీపీ లింబారెడ్డి తెలిపారు.
సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేసే తేజస్వినితో రాజీవ్‌కు పరిచయం కాగా, వారు సన్నిహితంగా ఉండటంతో శిరీషతో విభేదాలు తలెత్తాయి. రాజీవ్, శిరీష మధ్య రాజీ కుదర్చేందుకు కామన్ ఫ్రెండ్ శ్రావణ్ యత్నించాడు. హైదరాబాద్ నుంచి రాజీవ్ ఫోర్డు కారులోనే సోమవారం శ్రావణ్, శిరీష, రాజీవ్‌లు కుకునూర్ పల్లికి వెళ్లినట్లు సమాచారం. ప్రభాకర్‌రెడ్డి పోలీస్ క్వార్టర్స్‌లో పంచాయితీ జరిగాక... హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అదేరోజు రాత్రి 1.40 గంటలకు శిరీష తాను శామీర్‌పేట ప్రాంతంలో ఉన్నట్లుగా భర్త సతీశ్‌చంద్రకు వాట్సాప్ ద్వారా శిరీష లోకేషన్ పంపింది. రాత్రి మూడు గంటల ప్రాంతంలో స్టూడియోలో ఆమె ఆత్మహత్య చేసుకుందని శిరీష పనిచేసే స్టూడియో ఓనర్ రాజీవ్ పోలీసులకు వెల్లడించాడు. రాజీవ్‌పై అనుమానం ఉందంటూ సతీశ్‌చంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో కేసు వివాదం మొదలైంది.
ఈ క్రమంలో బుధవారం శ్రావణ్, రాజీవ్‌లను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుసుకున్న ప్రభాకర్‌రెడ్డి సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. అధికారుల ఒత్తిడి వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఓవైపు, శిరీష ఆత్మహత్యతో సంబంధం ఉండటం వల్లే సూసైడ్ చేసుకున్నాడని మరోవైపు సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తోంది. స్టూడియోలోని సీసీ కెమెరా ఫుటేజీలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. కాగా, శిరీష పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటివరకూ పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.