నగల దుకాణ దోపిడీ భగ్నం
ఠాణే: నగరంలోని ఓ నగల దుకాణంలో దోపిడీని పోలీసులు నిలువరించారు. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో అరెస్టయిన ఇద్దరు నిందితుల్లో గ్యాంగ్‌స్టర్ అబూ సలేం మాజీ సహచరుడు రాజేశ్ హాతణ్‌కర్ ఉన్నాడని నౌపాడా పోలీసు స్టేషన్ సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ జేడీ మోరే శుక్రవారం తెలిపారు. రద్దీగా ఉండే నౌపాడ ప్రాంతంలోని ఓ నగల దుకాణంలో ముఠా సభ్యులు దాడి చేయాలన్న నిర్ణయించుకున్నారన్న సమాచారం ఆధారంగానే అక్కడ కాపు కాశామని తెలిపారు.
అక్కడకు చేరుకున్న ఐదుగురిలో ముగ్గురు తప్పించుకోగా, ఇద్దరి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అబూ సలేం మాజీ సహచరుడైన కుర్లాకు చెందిన రాజేశ్ హాతణ్‌కర్ , కల్వాకు చెందిన సచిన్ కేదర్‌గా గుర్తించామన్నారు. వీరి నుంచి కత్తులు, తుపాకులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇదే ముఠా రెండు రోజుల క్రితం చరాయి ప్రాంతంలో ఓ నగల దుకాణాన్ని లూటీ చేసేందుకు యత్నించి విఫలమైందని తెలిపారు. ఠాణే, ముంబైలోని వివిధ పోలీసు స్టేషన్లలో రాజేశ్‌పై అనేక కేసులు నమోదై ఉన్నాయన్నారు. 12 హత్య కేసులు, పది దోపిడీ, 30 బెదిరింపు కేసులు ఉన్నాయని చెప్పారు. 2006-07 మధ్యలో రాజేశ్ జైల్లో ఉన్న సమయంలో అబూ సలేంతో ఏదో విషయంలో గొడవపడి దాడి చేశాడన్నారు.
ముంబైకి చెందిన ఔషధ విక్రేత ముఖేశ్ మెహతాను హత్య చేశాడని చెప్పారు. ఇలా పలువురు ప్రముఖులను అతను అంతమొందించాడని తెలిపారు. అనేక మంది వ్యాపారులను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడని చెప్పారు. అబూ సలేంకు ఒకప్పుడు నమ్మకంగా వ్యవహరించిన రాజేశ్ ఆ తర్వాతి క్రమంలో అతడి నుంచి దూరంగా వెళ్లిపోయాడని తెలిపారు.ఆ తర్వాత దొంగతనాలను ఎంచుకొని నగల దుకాణాలను కేంద్రంగా చేసుకున్నాడని చెప్పారు. సచిన్ కేదారిపై కూడా వివిధ కేసులు ఉన్నాయన్నారు. ఇదిలాఉండగా పారిపోయిన ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.