సెల్‌ఫోన్ తెచ్చిన తంటా...
తాడిపత్రి రూరల్, న్యూస్‌లైన్: తన భార్య సెల్ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోందన్న అనుమానం పెనుభూతం కావడమే భర్త చేతిలో నవవధువు రాజేశ్వరి హత్యకు కారణమని తాడిపత్రి డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ నెల 21 పుట్లూరు మండలం మడ్డిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో రాజేశ్వరి అనే వివాహిత హత్యకు గురైన విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం తాలూకా పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డికి, పామిడి మండలం అయ్యవారిపల్లికి చెందిన రాజేశ్వరితో ఆగస్టు 17న వివాహమైంది.
వీరి నిశ్చితార్థం జరిగిన 15 రోజులకు అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి అమెపై అనుమానాలు రేకెత్తించాడు. దీంతో, ఈ వివాహం తనకొద్దని చంద్రశేఖర్ రెడ్డి తిరస్కరించినా, పెద్దలు నచ్చజెప్పి వారి వివాహం చేయించా రు. కాగా, భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న అతను, ఆమెను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. నార్పల మండలం కురగానిపల్లికి చెందిన అతని మేనమామ బోగాతి రామకృష్ణ సాయంతో పులసర నూతలకు చెందిన నగేష్‌తో రూ.20 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ నెల 21 సాయంత్రం పథకం ప్రకారం రాజేశ్వరితో అనంతపురం నుంచి తిమ్మంపల్లికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. నార్పల చేరే సరికి రాత్రి కావడంతో దొంగలు దోచుకుంటారని, ఆమెపై ఉన్న నగలను తీసి మేనమామ ఇంటిలో భద్రపరచి, అక్కడి నుంచి ఓ తాడు వెంట తెచ్చుకున్నాడు. మార్గమధ్యంలో నగేష్‌ను మోటర్‌సైకిల్‌పై ఎక్కించుకున్నాడు. మడుగుపల్లి అటవీ ప్రాంతం రాగానే ద్విచక్ర వాహనం ఆపి రాజేశ్వరి గొంతుకు తాడు బిగించి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. రూరల్ సీఐ రాఘవన్, పుట్లూరు ఎస్ఐ శ్రీహర్షలు నిందితుని మేనమామ తోటలో దాచిన రూ.2లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారని, చంద్రశేఖర్‌రెడ్డి, రామకృష్ణ, నగేష్‌లను ఆరెస్టు చేసి కోర్టులో హాజరు పరచినట్లు వివరించారు.