నేల రాలిన విద్యా సుమం
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం ఓ విద్యార్థిని బలి తీసుకుంది. మరో బాలికకు తీవ్రగాయల య్యాయి. ఇద్దరు విద్యార్థినులు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వివరాలిలా ఉన్నా యి. పాత మధురవాడ ప్రాంతానికి చెందిన పాలవలస మేఘన, చంద్రంపాలెంకు చెందిన ప్రీతి, హనుమాన్ నగర్‌కు చెందిన ప్రత్యూషా, ఉషా ఇక్కడి జెడ్పీ ఉన్నత పాఠశాల్లో 8 వ తరగతి విద్యార్థులు.
న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని రాజీవ్‌గృహకల్ప కాలనీలో ఉంటున్న స్వప్నకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆ నలుగురు సైకిళ్లపై వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా కొమ్మాది జంక్షన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రమాదం చోటు చేసుకుంది. వీరు సైకిళ్లు నడిపించుకుంటూ వస్తున్న సమయంలో ఆయిల్ ట్యాంకర్ ఒకటి ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తూ మేఘన సైకిల్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో మేఘన అక్కడికక్కడే మృతి చెందగా , ప్రీతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఉషా, ప్రత్యూషలు త్రుటిలో తప్పించుకున్నారు. ఆ చిన్నారులు షాక్‌కు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్వప్న లబోదిబోమంటూ విలపించింది. తనకు శుభాకాంక్షలు చెప్పడానికి రాకుంటే ఈ సంఘటన జరిగి ఉండేదికాదని రోదించింది. ప్రమాదానికి కారణమైన ఆయిల్ ట్యాంకర్ వేగంతో నడపడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని స్థానికులు పలువురు ఆరోపించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ కెవి బాలకృష్ణ , ఎస్ఐ లక్ష్మణరావు తమ సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని కేసును దర్యాప్తు చేపట్టారు.
తీరని వేదన: అల్లారుముద్దుగా పెంచుకున్న మేఘన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లితండ్రులు కళ, చిన్నంనాయుడు చేస్తున్న రోదన వర్ణనాతీతం. శ్రీకాకుళం జిల్లా, పాలకొండ సమీపంలోని దేవుదల గ్రామానికి చెందిన వీరు ఇరవై ఏళ్ల క్రితమే పొట్టకూటి కోసం ఇక్కడికి తరలివచ్చారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కూతురు ఉషారాణి పదో తరగతి, చిన్న కూతురు మేఘన 8 వ తరగతి చదువుతోంది.
ఇద్దరు ఆడపిల్లలు ఆటపాటల్లో మంచి ప్రతిభను కనబరుస్తుండటంతో ఆ తల్లితండ్రులు సంతోషానికి అవధులు లేకుండా పోయింది. తాము కూలీనాలీ చేసుకుంటున్న తమ పిల్లల ప్రతిభ గలవారని గర్వపడేవారు. కాని ఆ విధికి మా పిల్లలను చూసి కన్నుకుట్టిందో ఏమోగాని చిన్నారి మేఘనను దూరం చేశాడని కళ, చిన్నంనాయుడు వాపోయారు.
హెచ్ఎమ్ దిగ్భ్రాంతి: మేఘన మృతిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎమ్ రాజబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంగ్లిషు మీడియం విద్యార్థి అయిన మేఘనఎంతో చలాకీ ఉండేదని ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమని ఆవేదన చెందారు.