రాజన్న కట్నం రూ.101 కోట్లు
వేములవాడ:: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవ స్థానంలో పార్వతీ రాజరాజేశ్వరుల కల్యాణం ఆదివారం వైభవంగా జరిగింది. స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య ఆధ్వర్యంలో 10.20 గంటలకు కల్యాణం నిర్వహించారు. వేములవాడ నగర పంచాయతీ పక్షాన చైర్పర్సన్ నామాల ఉమ స్వామివారికి పట్టువస్త్రాలు-తలంబ్రాలు సమర్పించారు. స్వామి వారికి రూ.101 కోట్లు కట్నం చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రూ.101 కోట్లతో పార్వతీ అమ్మవారికి నగలు చేయిస్తామని వరుడి తరపు పెద్దలు ప్రకటించారు. అనంతరం రాత్రి పెద్దసేవపై ఊరేగించారు. కల్యాణోత్సవానికి లక్ష మందికిపైగా భక్తులు హాజరయ్యూరు. ఆలయం లోపల కల్యాణ వేడుక నిర్వహించడంతో చాలా మంది భక్తులు బయటే ఉండిపోయూరు. భక్తులు భారీగా తరలిరావడంతో వేడిమికి తట్టుకోలేక అనేకమంది సృహ తప్పి పడిపోయూరు. మంగళవారం రథోత్సవం నిర్వహించనున్నారు.