26 ఏళ్లకు విముక్తి.. డిఫెన్స్‌కు రూ.5కోట్ల ఫైన్
న్యూఢిల్లీ: చేయని నేరానికి కోర్టు మార్షల్‌కు గురై గత ఇరవై ఆరేళ్లుగా విధులకు దూరంగా ఉంటున్న ఓ సైనికుడి(సెకండ్ లెఫ్టినెంట్ కల్నల్)కి న్యాయం జరిగింది. చివరికి అతడిని వెంటనే విధుల్లోకి తీసుకోవడమే కాకుండా ఈ కాలం నాటికి అతడు ఏఏ ర్యాంకులు పొందాలో అవన్నీ ఇచ్చి, రూ.4కోట్లు అతడికి చెల్లించాలంటూ జస్టిస్ డీపీ సింగ్, ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా ధర్మాసనం తీర్పు చెప్పింది. శ్రీనగర్‌లోని రాజపుట్ ఆరో బెటాలియన్‌లో 1991నాటికి ఎస్ఎస్ చౌహాన్ అనే వ్యక్తి సెకండ్ లెఫ్టినెంట్ అధికారిగా విధులు నిర్వర్తించేవారు.
అయితే, అతడిని పలాయనం చెందిన సైనికుడిగా, మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిగా పేర్కొంటూ 1991 నవంబర్ 4న అతడిపై కోర్టు మార్షల్ విధించగా నాటి శ్రీనగర్‌లోని జనరల్ ఆఫిసర్ ఇన్ కమాండింగ్ చీఫ్ కూడా ఆమోదించారు. దీంతో అప్పటి నుంచి ఆయన తిరిగి తన స్థానాన్ని పొందేందుకు కోర్టును ఆశ్రయిస్తునే ఉన్నారు. అతడు కోర్టుకు చెప్పిన ప్రకారం 1990 ఏప్రిల్ 11న శ్రీనగర్‌లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించే క్రమంలో చౌహాన్ 147 బంగార్లు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.
వీటి బరువు దాదాపు 27.5 కేజీల వరకు ఉంటుంది. వీటిని తన పై అధికారులు కల్నల్ కేఆర్ఎస్ పవార్, లెఫ్టినెంట్ జనరల్ జాకి మహ్మద్ అహ్మద్‌లకు అప్పగించారు. అయితే, వాటిని పై అధికారులే కాజేసినట్లు తెలిసింది. ఈ విషయంలో తీవ్ర అనుమానాలు రేపి చివరకు చౌహాన్‌కు కోర్టు మార్షల్ విధించేలా చేశారు. దీనికి సంబంధించి నిజనిజాలు తెలుసుకున్న ది ఆర్మ్డ్ ఫోర్స్ ట్రిబ్యునల్ చివరకు చౌహాన్ నిర్దోషిగా తేల్చింది. రక్షణశాఖకు రూ.5కోట్ల ఫైన్ విధించింది. వాటిల్లో రూ.4 కోట్లు చౌహాన్‌కు, మరో కోటిని అతడి పేరిట ఆర్మీ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ కింద నాలుగు నెలల్లో జమ చేయాలని తీర్పునిచ్చింది. బంగారు బిస్కెట్లు వ్యవహారం తేల్చాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.