పింఛన్ కోసం నాలుక కోసుకున్నాడు
సచివాలయంలో ఓ ఉద్యమకారుడి ఆవేదన
♦ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న రాజుచారి
♦ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఒంటికి నిప్పంటించుకున్న వైనం
♦ ప్రమాదంలో కాలు విరిగి కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితి పట్టించుకోని అధికారులు...
♦ గొంతుకోసుకోవడమే మిగిలిందంటూ రాజుచారి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాడు.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నమూ చేశాడు.. ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని ఎంతో సంబరపడ్డాడు.. దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంతో కాలు విరగ్గొట్టుకున్నాడు.. కొద్దినెలలుగా పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేశాడు.. చివరికి సచివాలయానికీ వచ్చాడు.. మూడు రోజులుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో సీఎం కార్యాలయం ఎదుట నాలుక కోసుకున్నాడు.. హైదరాబాద్‌లోని సూరారం కాలనీ ఆనంద్‌నగర్‌కు చెందిన అబ్బోజి రాజుచారి (48) ఆవేదన ఇది.
రాజుచారిది వరంగల్ జిల్లా పరకాల మండలం మాందర్పేట. 30 ఏళ్ల కింద పొట్టచేతబట్టుకుని సూరారం కాలనీకి వలస వచ్చి.. వడ్రంగి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య శోభ, ముగ్గురు పిల్లలు. తెలంగాణ ఉద్యమంలో రాజుచారి చురుగ్గా పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం డిమాం డ్తో 2014 జనవరి 5న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇది అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది కూడా. ఆ ఘటనలో రాజుచారి తీవ్రంగా గాయపడ్డారు. వారిది పేద కుటుంబం కావడంతో స్థానికంగా ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్దే చికిత్స పొందారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మానని గాయాలతోనే ఉన్న రాజుచారి సూరారం చౌరస్తా వద్దకు నడుచుకుంటూ వచ్చి జై తెలంగాణ నినాదాలు చేశారు కూడా. అయితే రాజుచారి ఆరోగ్యం కుదుటపడ్డాక ఓ రోజు సైకిల్‌పై పనికి వెళ్తుండగా బైక్ ఢీకొట్టి ఎడమ కాలు విరిగింది. కుటుంబ సభ్యులు ఆయనను ఎర్రగడ్డ చర్చి ఆస్పత్రిలో చేర్చించగా.. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేసి, కాలులో రాడ్డు వేశారు. దీంతో సరిగా నడవలేక, పనిచేయలేక రాజు కొన్ని నెలలుగా ఇంటి పట్టునే ఉండిపోయారు. ఆస్పత్రి ఖర్చుల కోసం సొంత ఇంటిని అమ్మేసుకుని.. వారి కుటుంబం ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది.
ప్రభుత్వ సాయం కోసం..
ఉద్యమంలో సర్వస్వం కోల్పోయిన తనను ఆదుకోవాలంటూ రాజుచారి ఎన్నోసార్లు స్థానిక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఫలితం లేకపోవడంతో తాను ఉద్యమంలో పాల్గొన్న ఫొటోలు, పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులు తీసుకుని సచివాలయానికి వచ్చారు. తనకు పింఛన్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని అధికారులను వేడుకున్నా రు. తనకు పింఛన్ ఇప్పించాలంటూ మంత్రి కేటీఆర్‌కూ లేఖ రాశారు. అయినా స్పందన కనిపించకపోవడంతో ఆవేదనకు లోనయ్యా రు. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో సచివాలయంలోని సీఎం కార్యాలయం ఎదుట బ్లేడుతో నాలుక కోసుకున్నా రు. భద్రతా సిబ్బంది ఆయనను సచివాల యం పక్కనే ఉన్న మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు పరిస్థితి నిలకడగానే ఉందని, నాలుక పూర్తిగా తెగకపోవడం వల్ల పెద్దగా ప్రమాదంలేదని వైద్యులు తెలిపారు.
పింఛన్, ఇల్లు ఇచ్చేదాకా పోరాడుతా: రాజుచారి
ఆస్పత్రిలో చేర్పించిన కొంత సేపటి అనంతరం కొద్దికొద్దిగా మాట్లాడుతూ, సైగలతో రాజుచారి తన బాధను వెళ్లగక్కారు. తెలంగాణ ఉద్యమంలో ఒంటికి నిప్పంటించుకుని పోరాటం చేశానని, ఇప్పుడు ప్రమాదంలో కాలు విరిగి నడవలేక కుటుం బాన్ని పోషించుకోలేకపోతున్నానని చెప్పారు. ఆసరా పింఛన్ ఇవ్వాలని విన్నవించుకుంటే.. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తనకు ఉండటానికి ఇల్లు, పింఛన్ ఇవ్వాలని.. లేకుంటే గొంతు కోసుకోవడం తప్ప మరో మార్గం లేదని వాపోయారు