rajyalaxmi
-
గుండెపోటుతో కరీంనగర్ డీఐఈవో మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(డీఐఈవో) టి.రాజ్యలక్ష్మి శుక్రవారం ఉదయం 10.20 నిమిషాలకు గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం వారి నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గత మూడున్నరేళ్లుగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మి టైపిస్టుగా ఉద్యోగంలో చేరి జూనియర్ లెక్చరర్‌గా, ప్రిన్సిపల్‌గా, డీఐఈవోగా సేవలందించారు. భర్త పోస్టల్ డిపార్ట్మెంట్లో చేసి గతంలోనే పదవీ విరమణ పొందారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్వస్థలం సిరిసిల్ల జిల్లా అయినప్పటికి 30ఏళ్ల క్రితం ఉద్యోగరీత్యా కరీంనగర్‌లోని చైతన్యపురిలో స్థిరపడ్డారు. రాజ్యలక్ష్మి భౌతికకాయానికి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి, తదితరులు నివాళి అర్పించారు. -
సినీనటి రాజ్యలక్ష్మికి సువర్ణ సత్కారం
పశ్చిమగోదావరి, భీమవరం(ప్రకాశం చౌక్): అమ్మవారి సన్నిధిలో సన్మానం పొందడం నా అదృష్టమని సినీని నటి రాజ్యలక్ష్మి(శంకరా భరణం–ఫేమ్) అన్నారు. మావుళ్లమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారి ఆలయం వద్ద కోటికలపూడి గోవిందరావు కళా వేదికపై రాజ్యలక్ష్మిని నిర్వాహకులు సన్మానించారు. సువర్ణ కంఠాభరణంతోసత్కరించారు. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ భీమవరం శ్రీమావుళ్లమ్మ అమ్మవారి గురించి, భీమవరం గురించి సీనియర్ నటీమణి గీతాంజలి చెప్పారని వివరించారు. భీమవరం వాసుల అభిమానం, ఆపాయ్యత చూస్తే మా పుట్టింటికి వచ్చినట్లు ఉందన్నారు. మళ్లీ ఏడాది కూడా ఉత్సవాలకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఉందని రాజ్యలక్ష్మి అభిలషించారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ చైర్మన్ మెంటే పార్థసారిథి, కనకరాజు సూరి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రాయప్రోలు భగవాన్, కార్యనిర్వహణ అధికారి నల్లం సూర్యచక్రధరరావు, నీరుల్లికూరగాయ పండ్లు వర్తక సంఘం అధ్యక్షుడు రామయణం గోవిందరావు, కార్యదర్శి కొప్పుల సత్యనారాయణ, అమ్మవారి ఉత్సవ కమిటీ అధ్యక్షులు మానేపేరయ్య, అడ్డల రంగరావు, కాగిత వీరమహంకాళరావు, చంద్రాజీ తదితరులు పాల్గొన్నారు. 300 సినిమాల్లో నటించా అంతకుముందు రాజ్యలక్ష్మి విలేకరులతో మాట్లాడారు. తాను ఇప్పటివరకు 300 చిత్రాల్లో నటించానని, శంకరాభరణంలో చేసిన పాత్ర ఎప్పటికీ మరిచిపోలేనిదని పేర్కొన్నారు. తమిళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించానని, పెళ్లయిన తర్వాత సింగపూర్ వెళ్లిపోయానని, దాదాపు పదేళ్ల తర్వాత తిరిగి వచ్చి ఇప్పుడు సినిమాలు చేస్తున్నానని చెప్పారు. ఇటీవల తాను నటించిన సినిమాలు విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కుమారులని, భర్త ఇంజినీర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. మా టీవీలో త్వరలో ప్రసారం కానున్న ఓ సీరియల్లో నటిస్తున్నట్టు వెల్లడించారు. -
నాడి పట్టిన నారి
నాడి పట్టి వైద్యం చేసేవారు డాక్టర్లయితే.. కష్టాల నాడి పట్టి మనోధైర్యం నింపేవారు ఈ మహిళా డాక్టర్లు. స్టెతస్కోప్‌తో గుండె పనితీరునే కాదు.. గుండెలో నిండి ఉన్న బాధనూ తీరుస్తున్నారు. సమస్యలతో వచ్చే మహిళా రోగుల్లో మనోస్థైర్యం నింపుతున్నారు. లబ్బీపేట (విజయవాడ తూర్పు): జీవితంపై ఎన్నో గాట్లు పడతాయి.. ప్రసవం కోసం కోసే కడుపు కోత ఒకటైతే..కష్టాల గుండెకోత మరొకటి.. మత్తు మందు ఇస్తే కడుపు కోత నొప్పి తెలియకపోవచ్చు..గుండెకోత నొప్పి మాత్రం ఈ డాక్టర్లకు చెబితేనే తీరుతుంది.ఆ నొప్పికి మంచి వైద్యంలాగే, ఈ నొప్పికి మనోధైర్యాన్ని నింపుతున్నారు ఈ మహిళా డాక్టర్లు. ఆమె వైద్యం.. మానసిక ధైర్యం ‘అమ్మ ఆదరించదు. అత్త పట్టించుకోదు. భర్త మద్యం సేవించి ఇంటికి వస్తుంటాడు. అలాంటి కుటుంబాలు నేటికీ ఎన్నో ఉన్నాయి. అలా ఆర్థిక ఇబ్బందితో పేద కుటుంబాలకు చెందినవారే ఎక్కువగా మా వద్దకు ప్రసవం కోసం వస్తుంటారు. వారిని చూస్తే జాలేస్తుంది. తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతూ ఇతర సమస్యలతో వస్తుంటారు. వారికి తక్షణమే స్పందించి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. కుటుంబ పరిస్థితులు చెబుతుంటే ఆవేదనకు గురవుతాం.’ సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో వైద్యవృత్తిని ఎంచుకున్నారు ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ డి.రాజ్యలక్ష్మి. నాన్న దేవరపల్లి అమ్మేశ్వరరావు కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్, అమ్మ సరస్వతి గృహిణి. ఉద్యోగంలో నిబద్ధతతో వ్యవహరించే నాన్నను స్ఫూర్తిగా తీసుకున్నారామె. అలా ఎంబీబీఎస్, పీజీ పూర్తిచేసి 1983లో సర్వీస్‌లో చేరారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన రాజ్యలక్ష్మి 1975–81 బ్యాచ్‌లో గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. 1982–84లో అబ్స్టేటిక్స్ అండ్ గైనకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. కాగా, పీజీ చదువుతున్న సమయంలోనే ఏపీపీఎస్సీ ద్వారా 1983లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన రాజ్యలక్ష్మి 35 ఏళ్లుగా పేదలకు సేవలు అందిస్తున్నారు. గుడిసెల్లోకి వెళ్లి మరి.. ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేసిన తొలినాళల్లో గుడిసెల్లోకి వెళ్లి నులకమంచంపైనే కాపర్ టీ లాంటివి వేసే వాళ్లమని ఆమె గుర్తుచేసుకున్నారు. గ్రామాలకు వెళ్లి షెల్టర్లలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసేవారు. ఇలా.. 35 ఏళ్లు ఎంతోమంది పేదలను చదివారామె. ‘ఇటీవల చుక్కమ్మ అనే గర్భిణీ ప్రసవం కోసం వచ్చింది. వారిది ప్రేమ వివాహం. ఇద్దరు పండంటి శిశులకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు లోకల్ సిండ్రోమ్ ప్రాబ్లమ్ కారణంగా మూడు నెలలుగా వెంటిలేటర్‌పైనే ఉంటోంది. ఇద్దరు పిల్లలకు మూడు నెలలు వయస్సు వచ్చినా తల్లి ఇంకా కోలుకోలేని స్థితిలోనే ఉంది. నా సర్వీసులో ఇలాంటి పరిస్థితి చూడలేదు.’ కుటుంబమంతా డాక్టర్లే మహిళలు ఎప్పుడూ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్లుగా ఉంటారని, తనకు ప్రతి పనిలో భర్త డాక్టర్ నాంచారయ్య సహకారం ఉంటుందని రాజ్యలక్ష్మి తెలిపారు. ఆయన జనరల్ సర్జరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారని, తనకు ఇద్దరు మగపిల్లలని, ఇద్దరూ ఎంబీబీఎస్ పూర్తిచేశారని చెప్పారు. మరింత మంది పేద మహిళలకు సేవచేస్తూ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని డాక్టర్ రాజ్యలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. అక్క వాళ్లు మెడిసిన్ చేసి బిజీగా ఉండటం చూసి ఆ జీవితం వద్దనున్నాను. అమ్మ అందుకు ఒప్పుకోలేదు. నాన్న నిర్ణయం ప్రకారం చేయాల్సిందేనన్నారు. కానీ, ఇప్పుడు ఈ వైద్య వృత్తిలోకి వచ్చి 21 సంవత్సరాలు నిండింది. ఎందరో అభాగ్యులైన మహిళలకు ఓదార్పుగా నిలిచిన క్షణాలు నాకు గుర్తు. సంతృప్తిగా ఉంది. మా నాన్న నిర్ణయం మంచిదని గుర్తించాను. రోగులకు ఆమె మనోస్థైర్యం సాధారణంగా హెచ్ఐవీ సోకినవారిని చాలామంది హీనంగా చూస్తుంటారు. వారి దగ్గరకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. కానీ, హెచ్ఐవీ సోకిన ఎంతోమంది బాధితులకు కంకిపాడు సామాజిక ఆరోగ్యకేంద్రం ఆస్పత్రి సూపరింటెండెంట్ (డీసీఎస్) చిత్రా గురుస్వామి. ధైర్యంగా ప్రసవాలు చేశారు. అంతేకాదు.. భర్త వేధింపులకు గురై శారీరకంగా గాయపడి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, లైంగిక దాడి జరిగిన మహిళలు, చిన్నారులకు ఎంతో సేవ చేశారు. వైద్యం ఒక్కటే ప్రధానం కాదు. మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తన 21 ఏళ్ల కెరీర్లో ఇలాంటి ఎన్నో కేసులను ఆమె పరిష్కరించారు. జీవితంపై విరక్తి చెందకుండా కౌన్సెలింగ్ నిర్వహించి బాధితుల్లో ధైర్యం నింపారు. వద్దనుకున్న రంగంలోనే విజయాలు చిత్రా గురుస్వామి తల్లిదండ్రులు గురుస్వామి, తాయమ్మ. ఐదుగురు అక్కచెల్లెళ్లు. ముగ్గురు వైద్యరంగం, ఇద్దరు ఇంజినీరింగ్ రంగం. చిత్రా గురుస్వామి పుట్టి పెరిగింది అంతా విజయవాడలోనే. ఉన్నత చదువులు అన్నీ మధురైలో కొనసాగించారు. ఇంటర్ పూర్తయ్యే నాటికి అక్కలు మెడిసిన్ చేసి వైద్యరంగంలో స్థిరపడ్డారు. వారి బిజీ జీవితం చూసి అమ్మో ఈ రంగం వద్దనుకున్నారామె. తల్లికి ఈ విషయాన్ని చెప్పారు. చదువు గురించి నాకేమీ తెలీదు. మీ నాన్న ఏం చెబితే అదే నిజం. అదే జరగాలి అని అమ్మ చెప్పింది. నాన్న నిర్ణయం ప్రకారమే మెడిసిన్ పూర్తిచేశారు. కొద్దిరోజులు తమిళనాడులోనూ, ప్రస్తుతం కంకిపాడులో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ‘హెచ్ఐవీ బాధితులు, గర్భిణులు.. ఈ పరిస్థితులు అన్నీ గమనించాక నాన్న నిర్ణయం సరైనదేనని గుర్తించాను. కౌమార దశలో వచ్చే మార్పును బాలబాలికలు గుర్తించి మసలుకోవాలి. మంచి నడవడిక అలవర్చుకుంటే మహిళలు, చిన్నారులపై దాడులు, వేధింపులు జరగవు.’ అన్నారు చిత్ర. – కంకిపాడు (పెనమలూరు) -
కీలక విషయాలు వెల్లడించిన హీరో రవితేజ తల్లి
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో తన కుమారుడికి సంబంధం లేదని హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి తెలిపారు. మాదక ద్రవ్యాల కేసులో రవితేజ పేరు బయటకు రావడం తనకు బాధ కలింగించిందన్నారు. రవితేజకు ఎలాంటి దురలవాట్లు లేవని చెప్పారు. తన కొడుకు సిగరెట్ తాగడని, తాగేవాళ్లను ప్రోత్సహించడని ఆమె అన్నారు. రవితేజకు డ్రగ్స్ అలవాటు ఉందనడం అవాస్తమని, కావాలనే ఈ కేసులో అతడిని ఇరికిస్తున్నారని ఆరోపించారు. మద్యం మత్తులోనే తన రెండో కుమారుడు భరత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. చనిపోయే కొద్ది రోజుల ముందు భరత్ అన్ని దురలవాట్లు మానేశాడని వెల్లడించారు. భరత్ బిగ్‌బాస్ షోకు కూడా ఎంపికయ్యాడని తెలిపారు. కుటుంబ ఆచారం ప్రకారమే భరత్ అంత్యక్రియలకు హాజరుకాలేదన్నారు. తన తమ్ముడు చనిపోయిన తర్వాత నిర్మాతలకు నష్టం రాకూడదనే రవితేజ షూటింగ్‌కు వెళ్లాడని చెప్పారు. భరత్‌ను రవితేజతో ముడిపెట్టి చూడొద్దని రాజ్యలక్ష్మి వేడుకున్నారు. కాగా, డ్రగ్స్ కేసులో రవితేజకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ధ్రువీకరించలేదు. -
చదువుల ‘రాజ్యం’ అస్తమయం
ఏయూ తొలి మహిళా రీసెర్చ్ స్కాలర్‌గా గుర్తింపు పలు అవార్డులు ఆమె సొంతం స్వచ్ఛంద సేవల్లోనూ తనదైన ముద్ర కాకినాడ వైద్యం : ఆమె జీవితం సమాజానికి అంకితం.. మరణం తరువాత కూడా.. తాత రఘుపతి వెంకటరత్నం నాయుడులా ఆమె సైతం బహుముఖ ప్రజ్ఞ కనబరచి విద్యావేత్తగా సామాజికవేత్తగా ఖ్యాతి గడించారు. ఆమే డాక్టర్ రాజ్యలక్ష్మి సామాజిక వేత్త, చదువుల సరస్వతి, బ్రహ్మసమాజికుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు మనుమరాలు డాక్టర్ తెలికిచర్ల రాజ్యలక్ష్మి (88) అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె కోరిక మేరకు పరిశోధనల నిమిత్తం ఆమె పార్థివ దేహాన్ని స్థానిక రంగరాయ కళాశాలకు ఆమె సోదరుడు కుంభంపాటి కమల్ వెంకటరత్నం అప్పగించారు. సెంట్రల్ ఇ¯ŒSలాండ్ బ్రేకిష్ ఆక్వాకల్చర్ (సిబా) మాజీ డైరెక్టర్, ఆలిండియా బ్రహ్మసమాజం మాజీ అధ్యక్షురాలిగా ఆమె ఉన్నారు. కొంత కాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న రాజ్యలక్షి్మని ఈ నెల 6న కాకినాడలోని ఓ ప్రైవేట్ (సేఫ్) ఆస్పత్రిలో చేర్పించామని ఆమె సోదరుడు తెలిపారు. డాక్టర్ రాజ్యలక్ష్మి కేంద్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారు. శాస్త్రవేత్తగా బ్రేకిష్ ఆక్వాకల్చర్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. రొయ్యలపై పరిశోధనలు చేసి, అమెరికా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించారు. సంఘసంస్కరణోద్యమ నేతగా పేరొందిన కుంభంపాటి రామశాస్త్రి (తారక్) సుగుణ దంపతులకు 1929 లో రెండో సంతానంగా రాజ్యలక్ష్మి జన్మించారు. ఈమె 1956లో ఆంధ్రాయూనివర్సిటీలో తొలి మహిళా రీసెర్చ్ స్కాలర్‌గా రికార్డు నెలకొల్పారు. 1989–90లో కేంద్రప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందారు. ఈమె భర్త శశి«భూషణ్ కూడా వ్యవసాయశాఖలో డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన అనంతరం కన్నుమూశారు. పదవీ విరమణ తర్వాత ఈమె ఆలిండియా బ్రహ్మసమాజం అధ్యక్షురాలిగా, కాకినాడ సమాజం అధ్యక్షురాలిగా పని చేశారు. కాకినాడలోని శ్రీరామ్‌నగర్‌లోని ఏబీసీ అపార్ట్మెంట్లో ఉంటున్న డాక్టర్ రాజ్యలక్ష్మి తల్లి సుగుణ ప్రముఖ సంఘ సంస్కర్త రఘపతి వెంకటరత్నంనాయుడుకు కుమార్తె కావడం గమనార్హం. -
విహార యాత్ర మృతుల్లో తెలుగమ్మాయి
సాక్షి ప్రతినిధి, కడప: మహారాష్ట్రలో విహార యాత్రకు వెళ్లి మృత్యువాత పడిన 14 మంది విద్యార్థుల్లో ఓ తెలుగమ్మాయి ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరుకు చెందిన పండుగాయల వెంకటరమణయ్య(50) కొన్నేళ్ల కిందట తల్లితో కలసి పుణేకు వెళ్లి స్థిరపడ్డాడు. ఏడాది కిందట ఈయన మృతి చెందాడు. ఇతని కుమార్తె రాజ్యలక్ష్మి(21) అలియాస్ స్వాతి పుణేలోని ఓ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సోమవారం రాయగఢ్‌కు సమీపంలోని అరేబియా సముద్రంలో దిగి అలల ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందిన వారిలో ఈమె కూడా ఉన్నట్లు చెన్నూరులో ఉంటున్న ఆమె తాత పండుగాయల రామకృష్ణయ్య తెలిపారు. సెల్ఫీ మోజు వల్లే.. రాయ్‌గఢ్ జిల్లా మురూడ్-జంజీరా తీరంలో సముద్రంలో మునిగి 14 మంది మరణించడానికి కారణం సెల్ఫీలేనని తెలుస్తోంది. అందరు కలసి సముద్రంలోకి దిగి ఫొటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఉవ్వెత్తున కెరటం ఎగసిపడటంతో సముద్రంలోకి కొట్టుకుపోయారని, ప్రాణాలతో బయటపడిన కొందరు విద్యార్థులు చెబుతున్నారు. సోమవారం రాత్రి 8 గంటలవరకు హెలీకాప్టర్లు, కోస్టల్‌గార్డు నౌకలతో చేపట్టిన గాలింపు చర్యల్లో 13 మంది మృతదేహాలు లభించగా, మంగళవారం ఉదయం మరో మృతదేహం లభించింది.