రాజ్యలక్ష్మిని సత్కరిస్తున్న నిర్వాహకులు
పశ్చిమగోదావరి, భీమవరం(ప్రకాశం చౌక్): అమ్మవారి సన్నిధిలో సన్మానం పొందడం నా అదృష్టమని సినీని నటి రాజ్యలక్ష్మి(శంకరా భరణం–ఫేమ్) అన్నారు. మావుళ్లమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారి ఆలయం వద్ద కోటికలపూడి గోవిందరావు కళా వేదికపై రాజ్యలక్ష్మిని నిర్వాహకులు సన్మానించారు. సువర్ణ కంఠాభరణంతోసత్కరించారు. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ భీమవరం శ్రీమావుళ్లమ్మ అమ్మవారి గురించి, భీమవరం గురించి సీనియర్ నటీమణి గీతాంజలి చెప్పారని వివరించారు. భీమవరం వాసుల అభిమానం, ఆపాయ్యత చూస్తే మా పుట్టింటికి వచ్చినట్లు ఉందన్నారు. మళ్లీ ఏడాది కూడా ఉత్సవాలకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఉందని రాజ్యలక్ష్మి అభిలషించారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ చైర్మన్ మెంటే పార్థసారిథి, కనకరాజు సూరి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రాయప్రోలు భగవాన్, కార్యనిర్వహణ అధికారి నల్లం సూర్యచక్రధరరావు, నీరుల్లికూరగాయ పండ్లు వర్తక సంఘం అధ్యక్షుడు రామయణం గోవిందరావు, కార్యదర్శి కొప్పుల సత్యనారాయణ, అమ్మవారి ఉత్సవ కమిటీ అధ్యక్షులు మానేపేరయ్య, అడ్డల రంగరావు, కాగిత వీరమహంకాళరావు, చంద్రాజీ తదితరులు పాల్గొన్నారు.
300 సినిమాల్లో నటించా
అంతకుముందు రాజ్యలక్ష్మి విలేకరులతో మాట్లాడారు. తాను ఇప్పటివరకు 300 చిత్రాల్లో నటించానని, శంకరాభరణంలో చేసిన పాత్ర ఎప్పటికీ మరిచిపోలేనిదని పేర్కొన్నారు. తమిళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించానని, పెళ్లయిన తర్వాత సింగపూర్ వెళ్లిపోయానని, దాదాపు పదేళ్ల తర్వాత తిరిగి వచ్చి ఇప్పుడు సినిమాలు చేస్తున్నానని చెప్పారు. ఇటీవల తాను నటించిన సినిమాలు విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కుమారులని, భర్త ఇంజినీర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. మా టీవీలో త్వరలో ప్రసారం కానున్న ఓ సీరియల్‌లో నటిస్తున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment