‘గోల్’ కొడతారా!
ఎన్నికల బరిలో పలువురు క్రీడాకారులు
న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ ఆటగాడు బైఛుంగ్ భుటియా, షూటింగ్లో ఒలింపిక్ పతకం సాధించిన రాజ్యవర్దన్ రాథోడ్, చిన్న వయసులోనే యువ భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహించిన మహమ్మద్ కైఫ్ వరకు పలువురు క్రీడాకారులు ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భుటియా డార్జిలింగ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేస్తున్నారు. 2011 ఆగస్టులో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఫుట్‌బాల్ ఆటగాడిగా పలు గోల్స్ సాధించిన భుటియా ఎన్నికల సమరంలో ఎంతవరకు నెగ్గుకొస్తాడో ఓటర్ల కరుణపైనే ఆధారపడి ఉంది. క్రీడా మైదానంలో చురుకైన కదలికలతో సత్తా చాటిన మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ యూపీ ఫూల్పూర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్నాడు. మరో మాజీ క్రికెటర్, ఎంపీ అజహరుద్దీన్ ఈసారి రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటం తెలిసిందే. జైసల్మేర్‌కు చెందిన ఒలింపిక్ షూటర్ రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్ జైపూర్ రూరల్ (బీజేపీ) నుంచి పోటీచేస్తున్నారు.