బేతమంగల నాగరాజ్‌కు కన్నడ రాజ్యోత్సవ అవార్డు
కోలారు : కరగ పూజారి బంగారుపేట తాలూకా బేతమంగల నాగరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం కన్నడ రాజ్యోత్సవ అవార్డుకు ఎంపిక చేసింది. బేతమంగల నాగరాజ్ బంగారుపేట తాలూకా బేతమంగల గ్రామ నివాసి జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన కరగ ఉత్సవాలలో గత 35 సంవత్సరాలుగా నృత్యం చేస్తూ పేరు ప్రఖ్యాతులు సాధించారు.
బేతమంగల నాగరాజ్. క రగ ఉత్సవాలు అనగానే గుర్తుకు వచ్చే పేరు బేతమంగల నాగరాజ్. ఆరు పదులు దాటినా నాగరాజ్ నేటికి ఎంతో ఉత్సాహంగా బరువైన కరగను మోస్తూ రాత్రంతా నృత్యం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు. బేతమంగల నాగరాజ్ కరగ ఉత్సవాలలో కరగ మోస్తూ నృత్యం చేస్తున్నారంటే ఆయన కాళ్ల మీద పడే వారు ఎంతోమంది.
శతాబ్దాల కాలంగా నాగరాజ్ కుటుంబం కరగ మోస్తూ ఉంది. ఆయన తండ్రి, తాత, ముత్తాతలు కూడా కరగను మోసి నత్యం చేసిన వారే. కరగ నృత్యం చేయడం వీరికి వంశ పారంపర్యంగా వస్తోంది. ప్రస్తుతం ఆయన కుమారుడు కూడా ఈ కళను అనుసరిస్తున్నాడు. 1979లో మొట్ట మొదటి సారిగా నాగరాజ్ కరగ నృత్యం చేశారు. వేల సంఖ్యలో కరగ నృత్య ప్రదర్శనలు అందించారు. చిక్కబళ్లాపురం, బాగేపల్లి, బెంగుళూరులోని హెసరుఘట్ట, తమిళునాడులోని హోసూరు, క్రిష్ణగిరి, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, వి కోట తదితర ప్రాంతాలలో ఆయన అనేక అనేక కరగ ప్రదర్శనలు ఇచ్చారు.
రాజ్యోత్స అవార్డు సంతోషం కలిగిస్తోంది : నాగరాజ్
ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నాకు కన్నడ రాజ్యోత్సవ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషంగా కలిగించింది. ఈ అవార్డు 50 ఏళ్లపాటు కరగను మోసిన నా తండ్రికి రావాల్సి ఉండింది. ఆయన బతికుంటే ఇప్పుడు ఎంతో సంతోషించే వారు. కరగ నృత్యమే నా ప్రాణం.