లవ్లీ ఎఫెక్షన్
హావభావాలు... గిలిగింతలు పెడతాయి. డైలాగులు.. పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. నవ్వుల రారాజు... ఢిల్లీ రాజు... ఎవరికి తోచినట్టు వారు ప్రేమగా పిలుచుకొంటారతడిని.రంగస్థలంసై ఉన్నా... వెండి తెరపై మెరిసినా... బుల్లి తెరపై ఇంట కనిపించినా... హాస్యపు జల్లులు కురుస్తాయి. సుతిమెత్తని కామెడీతో... మదిమదినీ మురిపిస్తున్న హాస్యనటుడు రాకేష్బేడీ.
సినిమాలు, టీవీ నటుడిగా బిజీగా ఉన్నా...తనను నిలబెట్టిన రంగస్థలాన్ని మాత్రం ఆయన ఇప్పటికీ వదల్లేదు. నాటకాల్లో నటిస్తూ... అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన రాకేష్ ఇటీవల ఖాదర్ అలీబేగ్ థియేటర్ ఫెస్టివల్లో భాగంగానగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సిటీ ప్లస్’తో ఆయన ‘చిట్‌చాట్’...
రుచికరమైన ఆహారం... మాట్లాడే భాష... ప్రజల స్నేహపూర్వక స్వభావం... హైదరాబాద్ నగరంలో నాకు బాగా నచ్చే అంశాలివి. ఇక్కడి వారు హిందీ, ఇంగ్లిష్ మాట్లాడే తీరు బాగుంటుంది. వారి మాటల్లో లవ్లీ ఎఫెక్షన్ కనిపిస్తుంది. అందుకే ఈ సిటీ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చినా వదులుకోను. సిటీజనులు నన్నో గొప్ప నటుడిలా చూస్తున్నారు. వారి నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ప్రేక్షక దేవుళ్లకు కోటి దండాలు.
తొలి సారి...
తొలిసారి హైదరాబాద్‌కు ‘ఏక్ దూజే కేలియే’ హిందీ చిత్రం షూటింగ్ కోసం వచ్చా. ఇక అక్కడి నుంచి వస్తూనే ఉన్నా. 1979తో సహాయనటుడుగా సినీ కేరీర్ ప్రారంభించా. ఎన్నో టీవీ సీరియల్స్ చేశా. 150పై బడి సినిమాల్లో నటించాను. రంగస్థలం మీద ప్రదర్శనలైతే లేక్కే లేదు.
యువత నటన వైపు...
నేటి తరంలో క్రియేటివిటీ చాలా ఎక్కువ. చూస్తే చాలు... ఏదైనా చేసేసే టైపు. శ్రమను నమ్ముకుని పట్టుదలగా ముందుకు సాగితే అవకాశాలు వాతంటవే మన తలుపు తడతాయి. ఇప్పుడు ఒక విషయం గురించిన సమాచారం కావాలంటే... నెట్లో కావల్సినంత సమాచారం చిటికెలో దొరుకుతుంది. టాలెంట్‌ను ప్రదర్శించుకోవడానికి బోలెడన్ని ప్రసార మాధ్యమాలు. నటుడిగా రాణించాలంటే సెల్ఫ్ డిసిప్ల్లిన్, నిరంతర అధ్యయనం ఉండాలి.