గృహోపకరణాల విభాగంలోకి హెచ్ఎస్ఐఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శానిటరీవేర్ దిగ్గజం హెచ్ఎస్ఐఎల్ గృహోపకరణాల విభాగంలోకి ప్రవేశించింది. ఫ్రెంచ్ కంపెనీ గ్రూపె అట్లాంటిక్‌తో పంపిణీ ఒప్పందం చేసుకుని భారత్‌లో హింద్‌వేర్ అట్లాంటిక్ బ్రాండ్‌తో వాటర్ హీటర్లను రూ.4-12 వేల శ్రేణిలో విడుదల చేసింది. పేటెంటెడ్ టెక్నాలజీ ఉన్న ఈ ఉపకరణాలను భారత్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. రూ.1,800 కోట్ల విలువైన వాటర్ హీటర్ల విపణిలో మూడేళ్లలో టాప్-3 స్థానాన్ని హెచ్ఎస్ఐఎల్ లక్ష్యంగా చేసుకుంది. ఈ విభాగం ద్వారా 2018 నుంచి ఏటా రూ.250 కోట్ల ఆదాయం ఆశిస్తోంది.
అమ్మకాలు పెరిగితే దేశీయంగా ప్లాంటు ఏర్పాటు చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించాయని హెచ్ఎస్ఐఎల్ జాయింట్ ఎండీ సందీప్ సొమానీ శుక్రవారం తెలిపారు. వాటర్ హీటర్లను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా కంజ్యూమర్ బిజినెస్ ప్రెసిడెంట్ రాకేశ్ కౌల్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. గ్రూపె అట్లాంటిక్ ఇతర దేశాల్లో విక్రయిస్తున్న సోలార్ వాటర్ హీటర్లు, రూమ్ హీటర్ల వంటి ఉత్పత్తులను భారత్‌లో ప్రవేశపెట్టే ఆలోచన ఉందన్నారు. హెచ్ఎస్ఐఎల్ గుజరాత్‌లోని దహెజ్ వద్ద 65 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇక్కడ రూ.160 కోట్ల వ్యయంతో 12 లక్షల యూనిట్ల సామర్థ్యం గల శానిటరీవేర్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. కంపెనీకి ఉన్న 2 శానిటరీ ఉత్పత్తుల తయారీ ప్లాంట్ల సామర్థ్యం 38 లక్షల యూనిట్లు. రూ.50 కోట్లతో చేపట్టిన విస్తరణ పూర్తి అయితే ఇది 42 లక్షల యూనిట్లకు చేరుకుంటుంది.