ram vilas vedanti
-
బాబ్రీ కేసులో నిందితులకు బెయిల్
-
బాబ్రీ కేసులో నిందితులకు బెయిల్
లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణను ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఇతర నిందితులు బీఎల్ శర్మ, మహంత్ నృత్య గోపాల్ దాస్, చంపత్ రాయ్, ధర్మదాస్లతో పాటు రామ్ విలాస్.. లక్నోలోని సీబీఐ స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ స్పెషల్ కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. రూ 20 వేల పూచికత్తుపై ఈ ఐదుగురికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను మే 22కు వాయిదా వేసింది. తనతో పాటు లక్షలాది మంది కరసేవకులు బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూల్చారని, రాముడి కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
అవును.. బాబ్రీ మసీదును నేనే కూల్చమన్నా
బాబ్రీ మసీదును కూల్చేందుకు కరసేవకులను ప్రేరేపించినది తానేనని బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి మరోసారి స్పష్టం చేశారు. తనతో పాటు లక్షలాది మంది కరసేవకులు బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూల్చారన్నారు. రాముడి కోసం తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని, ఉరిశిక్ష అనుభవించడానికి కూడా సిద్ధమని, కానీ అబద్ధాలు మాత్రం చెప్పబోనని అన్నారు. రామ మందిరం నిర్మాణం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు. అక్కడ మసీదు ఎప్పుడూ లేదని, కేవలం శిథిల స్థితిలో ఓ నిర్మాణం మాత్రమే ఉండేదని.. దాన్ని మాత్రమే తాము కూల్చామని ఆయన తెలిపారు. 1992లో భారీసంఖ్యలో వచ్చిన కరసేవకులు బాబ్రీమసీదును కూల్చిన ఘటనతో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీకి ఎలాంటి సంబంధం లేదని శుక్రవారం నాడు రామ్ విలాస్ వేదాంతి చెప్పిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో వేదాంతి సహా మరో 12 మంది నిందితులుగా ఉన్నారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాజమాత విజయరాజె సింధియాల మీద మోపిన ఆరోపణలన్నీ అవాస్తవమని వేదాంతి చెబుతున్నారు. అద్వానీ, జోషి, ఉమాభారతి లాంటివాళ్లంతా నిర్దోషులని, కూల్చివేత వెనుక కుట్ర అంటూ ఏమీ లేదని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి కూడా అన్నారు. ఇక సుప్రీంకోర్టులో కేసు ఒక సర్వసాధారణ తతంగం మాత్రమేనని, విచారణ పూర్తయిన తర్వాత బీజేపీ అగ్రనాయకులంతా నిర్దోషులుగా బయటపడటం ఖాయమని చెప్పారు. తమమీద పన్నిన కుట్రలన్నీ విఫలమయ్యాయని ఆరోజు వారు గర్వంగా చెప్పుకొంటారని ధీమా వ్యక్తం చేశారు. -
‘అద్వానీ కాదు నేను.. ఉరికి కూడా రెడీ’
ఫైజాబాద్: ‘అద్వానీకి సంబంధం లేదు.. ఆ రోజు కరసేవకులను రెచ్చగొట్టింది నేను. శిక్ష అనుభవించేందుకు నేను సిద్ధం. ఉరి తీయించుకునేందుకు కూడా రెడీ’ అంటూ బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి కుట్ర పూరిత నేరం కేసు దర్యాప్తు జరగాల్సిందేనని, అందులో బీజేపీ కురువృద్ధ నేత ఎల్కే అద్వానీ సహా మురళీ మనోహర్ జోషి తదితర సీనియర్ నేతలను చేర్చాల్సిందేనని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ విలాస్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బాబ్రీ ఘటనలో అద్వానీ పాత్ర లేదు. ఆ రోజు కూల్చివేత జరుగుతున్నప్పుడు నేను వీహెచ్పీ నేత అశోక్ సింఘాల్, మహంత్ అవైద్యనాథ్తో ఉన్నాను. కర సేవలకులను రెచ్చగొట్టింది నేను. నేను మరికొందరితో కలిసి ఆ రోజు కరసేవకులను రెచ్చగొడుతుంటే జోషీ, అద్వానీ, విజయ్ రాజే సింధియా మాత్రం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు, శాంతియుత పరిస్ధితులు నెలకొల్పేందుకు ప్రయత్నించారు’ అని ఆయన చెప్పారు. బాబ్రీ కేసులో ఈయన పేరు కూడా ఉంది.