‘అద్వానీ కాదు నేను.. ఉరికి కూడా రెడీ’
ఫైజాబాద్: ‘అద్వానీకి సంబంధం లేదు.. ఆ రోజు కరసేవకులను రెచ్చగొట్టింది నేను. శిక్ష అనుభవించేందుకు నేను సిద్ధం. ఉరి తీయించుకునేందుకు కూడా రెడీ’ అంటూ బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి కుట్ర పూరిత నేరం కేసు దర్యాప్తు జరగాల్సిందేనని, అందులో బీజేపీ కురువృద్ధ నేత ఎల్‌కే అద్వానీ సహా మురళీ మనోహర్ జోషి తదితర సీనియర్ నేతలను చేర్చాల్సిందేనని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రామ్ విలాస్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బాబ్రీ ఘటనలో అద్వానీ పాత్ర లేదు. ఆ రోజు కూల్చివేత జరుగుతున్నప్పుడు నేను వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్, మహంత్ అవైద్యనాథ్‌తో ఉన్నాను. కర సేవలకులను రెచ్చగొట్టింది నేను. నేను మరికొందరితో కలిసి ఆ రోజు కరసేవకులను రెచ్చగొడుతుంటే జోషీ, అద్వానీ, విజయ్ రాజే సింధియా మాత్రం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు, శాంతియుత పరిస్ధితులు నెలకొల్పేందుకు ప్రయత్నించారు’ అని ఆయన చెప్పారు. బాబ్రీ కేసులో ఈయన పేరు కూడా ఉంది.