
బీజేపీ మాజీ అధ్యక్షుడు, అటల్ ప్రభుత్వంలో ఉప ప్రధాని సేవలందించిన లాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను అందజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపధ్యంలో అద్వానీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
భారత రాజకీయాల్లో భీష్మ పితామహునిగా పేరొందిన అద్వానీ రాజకీయ జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మార్గదర్శకునిగా నిలిచారు. కమలతో అద్వానీ వివాహం అత్యంత విచిత్ర పరిస్థితుల్లో జరిగింది.
కమలా అద్వానీ పాకిస్తాన్‌లోని సింధ్‌లో జన్మించారు. ఆమె అసలు పేరు కమలా జగత్యాని. విభజన తర్వాత వారి కుటుంబం భారతదేశానికి తరలి వచ్చింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కమల చదువు పూర్తి చేసుకున్నాక, ఢిల్లీ పోస్టాఫీసులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.
ఇదీ చదవండి: ఎల్‌కే అద్వానీకి భారతరత్న.. మోదీ భావోద్వేగం
అదే సమయంలో ఆమెకు లాల్ కృష్ణ అద్వానీ నుంచి వివాహ ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో లాల్ కృష్ణ అద్వానీ జర్నలిస్టుగా పనిచేసేవారు. ప్యాంటు షర్టు వేసుకుని, సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లేవారు. కమల అద్వానీలకు 1965, ఫిబ్రవరి 25న వివాహం జరిగింది.
అద్వానీ భార్య కమలా అద్వానీ రాజకీయాల్లో కాలుమోపనప్పటికీ, పలు కార్యక్రమాలలో అద్వానీతో పాటు కనిపించారు. ఆమె అద్వానీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. అలాగే అద్వానీ తినే ఆహారం మొదలుకొని, అతనిని కలుసుకునే వారి జాబితా వరకు అన్నింటిపై కమలా అద్వానీ ఒక కన్నేసి ఉంచేవారు. అద్వానీ ఒక సందర్భంలో తాను దేశానికే హోంమంత్రినని, ఇంటిలో తన సతీమణి కమలనే హోంమంత్రి అంటూ చమత్కరించారు.