కొత్తపల్లి గీత భర్తకు చుక్కెదురు
హైదరాబాద్: బ్యాంకు రుణం ఎగవేత కేసులో అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావుకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. తనకు వ్యతిరేకంగా ఎర్రమంజిల్ ఇచ్చిన తీర్పును నాంపల్లి కోర్టులో సవాల్ చేసిన ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. రామకోటేశ్వరరావుకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పును నాంపల్లి కోర్టు సమర్థించింది.
సొంత కంపెనీ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ. 25 కోట్లు రుణంగా తీసుకుని ఎగవేయడంతో ఆయనకు ఎర్రమంజిల్ కోర్టు శిక్ష విధించింది. బ్యాంక్ నుంచి ఆయన తీసుకున్న మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. దీనిపై ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కాగా, కొత్తపల్లి గీతకు కూడా శిక్ష విధించాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వేసిన పిటిషన్ ను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది.
విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు ఎండీగా వ్యవహరించిన రామకోటేశ్వరరావు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 2008 డిసెంబర్లో రూ. 25 కోట్లు లోన్ తీసుకున్నారు. బాకీ తీర్చేందుకు ఆయన ఇచ్చిన రూ. 25 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కావడం, పదే పదే నోటీసులు పంపినా స్పందించకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఆయనను దోషిగా తేల్చిన న్యాయస్థానం శిక్ష విధించింది.