ఇద్దరు కిలేడీలు అరెస్ట్
తుర్కయంజాల్: మాటలతో నమ్మించి, మోసం చేసి దుస్తులను చోరీ చేసి అమ్మడానికి వెళ్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. క్రైమ్ ఎస్సై సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మంకు చెందిన నల్లగొండ నారాయణ భార్య రమాతులసి (45), బాలసాని రవి భార్య కుమారి (40)లు ఇద్దరు కలిసి ఈ నెల 19న వనస్థలిపురంలోని గేట్వేకాలనీలోగల కాటన్ ఎక్స్పో బట్టల దుకాణంలోకి వెళ్లారు.
అనంతరం వీరితో పాటు వీరికి చెందిన మరో ముగ్గురు మహిళలు వచ్చారు. అంతా కలిసి బట్టలు కావాలంటూ బేరసారాలు చేశారు. ఈ సమయంలో వారు సుమారు 200పైగా టీషర్ట్లతోపాటు కొన్ని చీరలను కళ్లుగప్పి ఎత్తుకెళ్లారు. అనంతరం ఈ నెల 20న ఉదయం వేళలో ఎస్కేడీనగర్ చౌరస్తాలో వాహనాల తనిఖీలలో ఉన్న పోలీసు సిబ్బందికి అనుమానాస్పదంగా బట్టల మూటలు తీసుకెళ్తూ పట్టుబడ్డారు. వీరిని విచారించగా సుమారు రూ.1.70 లక్షల విలువ చేసే బట్టలు పట్టుబడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు మహిళలను రిమాండ్కు తరలించారు. మరో ముగ్గురు మహిళలు పరారీలో ఉన్నారు.