నంద్యాల శాస్త్రవేత్తకు అవార్డుల పంట
నంద్యాలరూరల్: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రామారెడ్డికి హైదరాబాద్ విత్తన సంస్థ బెస్ట్ సైంటిస్ట్ అవార్డు, డాక్టర్ ఐవీ సుబ్బారావు మెమోరియల్ అవార్డులు వరించాయి. రైతు నేస్తం వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఆవార్డులు అందుకోవడంపై నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ వ్యవసాయ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈయనది కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని శంకరాపురం. ప్రాథమిక విద్య ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ టౌన్ మనోహార్ పీజీ కళాశాల ఉత్తర ప్రదేశ్‌లో పూర్తి చేశారు. పత్తిపై పీహెచ్‌డీని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కళాశాల చేశారు. 1985 నుంచి 90 వరకు అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానంలో వేరుశనగ, కంది, ఆముదంపై పరిశోధనలు చేశారు. 1990 నుంచి నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ముంగారి పత్తిలో అరవింద, శ్రీనంది, యాగంటి, అమెరికన్ పత్తిలో నరసింహ, శివనంది, శ్రీరామ, సంకర రకాల్లో హెచ్ఎస్ 390, 290 రకాలు విడుదల చేశారు. ఈ నెల 2వ తేదీ హైదరాబాద్ విత్తన సంస్థ బెస్ట్ సైంటిస్ట్ అవార్డు, ఈనెల 11వ తేదీన హైదరాబాద్‌లో రైతు నేస్తం 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు మెమోరియల్ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు డాక్టర్ రామారెడ్డిని ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ గోపాల్‌రెడ్డి, సీనియర్, జూనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, సిబ్బంది అభినందించారు.