ప్రజా సేవకే పోలీసులు అంకితం: ఐజీ నాగిరెడ్డి
సెంటినరికాలనీ : రాష్ట్రంలో ప్రజాసేవకు పోలీసులు అంకితమయ్యారని ఐజీ నాగిరెడ్డి అన్నారు. బుధవారం కమాన్‌పూర్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రామగిరిఖిల్లా ప్రాంతంలో చేపట్టిన హరితహారంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. రామగిరిఖిల్లా ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రాంతమని, పదిహేనేళ్లక్రితం పోలీసులు ఖిల్లాకు వచ్చేవారని, ప్రస్తుతం మొక్కలు నాటేందుకు వచ్చినట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది జిల్లాలో 74 లక్షల మొక్కలు నాటామని, పోలీస్స్టేషన్ల ఆవరణలో మూడు లక్షల మొక్కలు నాటగా, బయటి ప్రదేశాల్లో మిగతా మొక్కలు నాటినట్లు ఆయన పేర్కొన్నారు.
ఎస్పీ జోయల్‌డేవిస్ మాట్లాడుతూ.. జిల్లాల్లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 14 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పోలీస్‌శాఖ ఏ కార్యక్రమం చేపట్టినా ఎమ్మెల్యే సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు.
ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ ఒకప్పుడు మంథని ప్రాంతమంటే తుపాకుల మోతగా ఉండేదని, అలాంటిది పోలీసులు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పోలీసులు ప్రజలతో మమేకమయ్యారని తెలిపారు. నిరుద్యోగయువతకు శిక్షణ శిబిరాలు, ఉద్యోగాలు సాధించడంలో తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. పోలీసులకు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్, టూటౌన్ సీఐ దేవారెడ్డి, కమాన్‌పూర్ ఎసై ్స ప్రదీప్‌కుమార్, ఎంపీపీ ఇనగంటి ప్రేమలత, జెడ్పీటీసీ మేకల సంపత్‌యాదవ్, సర్పంచ్ బోగె లింగయ్య, ఎంపీటీసీలు పల్లె ప్రతిమ పీవీ.రావు, బూక్య ఆశాకుమారి, ముల్మూరి శ్రీనివాస్, ముస్త్యాల శ్రీనివాస్, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.