తెలంగాణలో ఆర్టీసీ సేవలు భేష్: రామైరాం
బీహార్ రవాణా మంత్రి రామైరాం ప్రశంస
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజలకు ఆర్టీసీ మంచి సేవలు అందిస్తోందని బీహార్ రవాణాశాఖ మంత్రి రామైరాం ప్రశంసించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన తెలంగాణ రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, సంబంధిత అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. బీహార్, తెలంగాణ రాష్ట్రాల రవాణా వ్యవస్థ, ఆర్టీసీల సేవలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా బీహార్ మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ సేవలు బాగున్నాయన్నారు. బీహార్ ఆర్టీసీ ఆధ్వర్యంలో నాలుగు వందలలోపు బస్సులే ఉన్నాయన్నారు. వాటిలో ఏసీ బస్సు ఒక్కటీ లేదన్నారు. తెలంగాణ రవాణా మంత్రి మహేందర్‌రెడ్డిని బీహార్ పర్యటనకు ఆయన ఆహ్వానించారు.
అందుకు మహేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. అంతకుముందు రాష్ట్రంలో రవాణా పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కొత్త రోడ్ల నిర్మాణాలతో తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు రవాణా సదుపాయాలు కల్పించే ప్రణాళికలు వివరించారు. అభివృద్ధికి రవాణా కీలకంగా మారిన తరుణంలో ఆర్టీసీ సేవలు మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా కమిషనర్ జగదీశ్వర్, జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ జేఎండీ రమణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.