కార్పొరేషన్ పదవులకు ముగ్గురి ఎంపిక
వర్ల రామయ్యకు హౌసింగ్
పంచుమర్తి అనూరాధకు మహిళా సహకార ఆర్థిక సంస్థ
కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా రామానుజయ్య
విజయవాడ : జిల్లాకు చెందిన ముగ్గురు నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. మంగళవారం ఎనిమిది కార్పొరేషన్ పదవుల్ని కేటాయించగా.. అందులో మూడు కృష్ణాకే కేటాయించారు. వారిలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, విజయవాడ నగర తొలి మహిళా మేయర్‌గా పనిచేసిన పంచుమర్తి అనూరాధను మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పామర్రు నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్న వర్ల రామయ్యను హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న చలమలశెట్టి రామానుజయ్యను కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపిక చేశారు.
అనూరాధ మేయర్‌గా పనిచేసిన రోజుల నుంచి చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నారు. గతేడాది ఆమెకు ఎమ్మెల్సీ పదవి చేతివరకు వచ్చి జారిపోయింది. పార్టీ తరఫున ప్రసార మాధ్యమాల్లో తన గళాన్ని వినిపించటంలో అనూరాధ గుర్తింపు తెచ్చుకున్నారు. విజయవాడ నుంచి ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడటంతో ప్రస్తుతం ఆమెకు కార్పొరేషన్ పదవిని కట్టబెట్టారు. వర్ల రామయ్య 2009లో చిత్తూరు ఎంపీగా, 2014లో పామర్రు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కూడా గత ఏడాది ఎమ్మెల్సీ టికెట్ ఆశించినా దక్కలేదు. కలిదిండి మండలానికి చెందిన చలమలశెట్టి రామానుజయ్య కేడీసీసీలో డీసీఎంఎస్ చైర్మన్‌గా, రెండు పర్యాయాలు టీడీపీ కార్యదర్శిగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించారు. వీరిద్దరినీ కూడా కార్పొరేషన్ పదవులకు ఎంపిక చేశారు.