ప్రచారం కాదు.. అమలు ఎప్పుడో చెప్పాలి
రిజర్వేషన్లపై టీడీపీ నేతలు రమణ, రేవంత్, మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు, ముస్లింలకు రిజర్వేషన్లని గొప్పలు చెప్పుకోవడానికే పరిమితం కాకుండా, వాటిని ఎప్పటినుంచి అమలుచేస్తారో చెప్పాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని కార్యాల యంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ రిజర్వేషన్ల గురించి ప్రచారం చేసుకోవడం, గొప్పలు చెప్పుకోవడానికే టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు.
టీఆర్ఎస్ మేనిఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్‌గా చెప్పుకుంటున్న కేసీఆర్ ఇప్పటిదాకా ఎన్ని హామీలను అమలు చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి అయినా సచివాలయానికి వచ్చి, అభివృద్ధి, సంక్షేమ పథకాలను పూర్తి చేస్తుంటే కేసీఆర్ మాత్రం 150 ఎకరాల గడీ నుంచి నియంతృత్వంగా పాలిస్తున్నాడని ఎల్.రమణ విమర్శించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌కు చాలా తెలివి ఉందని, దానినంతా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే ఉపయోగిస్తు న్నారని విమర్శించారు.
2018లోపు గిరిజన, ముస్లింలకు రిజర్వేషన్లను అమలు చేయకుంటే ఓట్లు అడగను అని ప్రకటించే ధైర్యం కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణలో బంగారు తెలంగాణ బ్యాచ్ అంతా జేబుల్లో పాల ప్యాకెట్లు, కేసీఆర్ ఫొటో పెట్టుకుని పాలాభిషేకాలు చేయడానికి తిరుగుతున్నదని ఎద్దేవా చేశారు. మోత్కుపల్లి మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ హామీని పూర్తిగా అమలుచేశారో చెప్పాలన్నారు.