మైనింగ్‌కు ఓకే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ర్టం లో ఏ, బీ కేటగిరీల మైనింగ్ కంపెనీలకు ఇనుప ఖనిజం తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నట్లు అటవీ శాఖ మంత్రి రమానాథ్ రై వెల్లడించారు. అయితే తవ్వి తీసిన ఇనుప ఖనిజాన్ని స్వేచ్ఛా విపణిలో కాకుండా టెండర్ల ద్వారా విక్రయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక్కడి అరణ్య భవన్లో బుధవారం నిర్వహించిన వీర యోధుల దినంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇదివరకే 14 కంపెనీలకు మైనింగ్‌కు అనుమతినిచ్చామని చెప్పారు. అన్నిటికీ పకడ్బందీగా సరిహద్దులను గుర్తించామన్నారు. ఆ సరిహద్దుల లోపే ఇనుప ఖనిజం తవ్వకాలను చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఖనిజాన్ని ఉన్నత స్థాయి కమిటీ సమక్షంలో ఈ-ఆక్షన్ ద్వారా వేలం వేయాల్సి ఉంటుందన్నారు. సుప్రీం కోర్టు డీ కేటగిరీ మైనింగ్‌ను పూర్తిగా రద్దు చేసిందని గుర్తు చేస్తూ, కొత్తగా వేలం ద్వారా లెసైన్సులు మంజూరు చేసే విషయమై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని వెల్లడించారు. సీ కేటగిరీ మైనింగ్ లెసైన్సులు కూడా రద్దయ్యాయని తెలిపారు.
గజధామం
అడవి ఏనుగులు ఊర్లపై పడి పంట, ప్రాణ నష్టం చేస్తున్నందున, వాటిని నియంత్రించడానికి సమర్థంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. నాగరహొళె వద్ద రూ.వంద కోట్ల ఖర్చుతో 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గజధామాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీని కోసం ఇదివరకే రూ.30 కోట్లు విడుదల చేశామన్నారు. 21 కిలోమీటర్ల మేర కందకాల తవ్వకం, సౌర విద్యుత్ కంచెల ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు ఆరు వేల ఏనుగులున్నట్లు అంచనా అని చెప్పారు. ఏనుగులు పంట నష్టం కలిగిస్తున్న అన్ని చోట్లా సౌర విద్యుత్ కంచెలు నిర్మిస్తామని ఆయన తెలిపారు. అంతకు ముందు వీర యోధులకు నివాళులర్పించే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రకృతి సమతుల్యత కోసం అడవుల రక్షణకు ప్రాధాన్యతనివ్వాల్సి ఉందన్నారు. ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా అటవీ సంపదను కాపాడిన యోధులను స్మరించుకోవడం మన ధర్మమన్నారు. అడవి దొంగ వీరప్పన్ కుట్రకు బలైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ సహా 47 ఏళ్లలో 38 మంది అటవీ సిబ్బంది అడవులు, వన్య మృగాల సంరక్షణలో ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు.