ramanavami celebrations
-
సీతారామ స్వామి దేవస్థానంలో రామనవమి వేడుకలు
-
భద్రాద్రి రామయ్యకు కేసీఆర్ పట్టువస్త్రాలు
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీరామనామ స్మరణతో మార్మోగిపోతుంది. ఎటు చూసినా భక్తజనమే దర్శనమిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న రాములోరి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణ వేడుక శనివారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైంది. అభిజిత్ లగ్నమందు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారు సీతమ్మ మెడలో మాంగల్యధారణ చేస్తారు. ఈ కమనీయ ఘట్టాన్ని భక్తులు కూర్చొని తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా భద్రాద్రి చేరుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయన రాములువారికి అందచేశారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు నవమి వేడుకల్లో పాల్గొన్నారు. -
రామతీర్థంలోనూ అధికారికంగా నవమి వేడుకలు
విజయనగరం : విజయనగరం జిల్లా రామతీర్థంలోనూ ప్రభుత్వం అధికారికంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత రామతీర్థం, ఒంటిమిట్టలలో ఎక్కడ నిర్వహించాలనే దానిపై విస్తృత చర్చ సాగింది. ప్రభుత్వం ఒంటిమిట్టను ప్రత్యేక హోదా ఉన్న క్షేత్రంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ అధికార లాంఛనాలతో వేడుకలు జరుపుతోంది. కాగా రామతీర్థంను ఎంపిక చేయకపోవడంపై ఉత్తరాంధ్ర సాధుపరిషత్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, భక్తులు ఆందోళనలు చేశారు. ఆమరణ నిరాహార దీక్షలకూ దిగారు. దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్పందించి రామతీర్థంలోనూ అధికారికంగా వేడుకలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వేడుకలకు మంత్రి మాణిక్యాలరావు సతీసమేతంగా హాజరై, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు సమర్పించనున్నారు. ఉదయం 10గంటలకు స్వామివారిని కల్యాణ మండపానికి తీసుకొచ్చి, 12 గంటలకు సీతారాముల కల్యాణం జరిపించనున్నారు. రామతీర్థంలో రాముడిని వనవాస రాముడిగా పిలుస్తారు.