ఎయిమ్స్‌లో పరిస్థితి మరీ ఇంత దారుణమా?
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితికి అద్దం పట్టిన ఉదంతమిది. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న వృద్ధురాలికి అత్యవసరంగా ఆపరేషన్ నిర్వహించడానికి డాక్టర్లు ఇచ్చిన తేదీని చూస్తే ఎవరైనా అవాక్కవాల్సిందే. దాదాపు మూడేళ్ల తరువాత, ఫిబ్రవరి 20,2020వ సం.రంలో ఆపరేషన్ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఆసుపత్రిలో పడకలు లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పడంతో రోగి బంధువులు ఆందోళనలో పడిపోయారు.
వివరాల్లోకి వెళితే..బీహార్ కు చెందిన రమారతిదేవి దేవి (65 ) బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతోంది. పరిస్థితి విషమించడంతో పట్నా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఎయిమ్స్ న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్ కు రిఫర్ చేశారు. ఆమెను పరీక్షించిన ఎయిమ్స్ వైద్యులు అత్యవసర ఆపరేషన్ అంటూనే ఫిబ్రవరి 20, 2020న నిర్వహిస్తామని చెప్పారు. దీంతో ఆమె కొడుకు గులాబ్ థాకూర్ షాక్ లో వుండిపోయారు.
తాము చాలా పేదవాళ్లమనీ, ప్రయివేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకునే స్థోమత లేదని గులాబ్ థాకూర్ వాపోయారు. 2020 సం.రం నాటికి అంటే చాలా ఆలస్యమవుతుందనీ, అనారోగ్యంతో తన తల్లి చనిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన తలనొప్పి, మెమరీ లాస్ తో బాధపడుతున్న అమ్మ పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోందనీ.. అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని కోరుతున్నారు.
అయితే రోగుల రద్దీ అంత తీవ్రంగా ఉండడం వల్లే ఈనిర్ణయం తీసుకున్నామని న్యూరోసర్జరీ విభాగం అధిపతి డాక్టర్ బి.ఎస్. శర్మచెప్పారు. సాధారణంగా పరిస్థితి తీవ్రతను ఆధారంగా తేదీలు ఇస్తామని, కొన్నిసార్లు ఆసుపత్రిలో బెడ్ ల కొరత కారణంగా ఈ వెయింటింగ్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. చాలా అత్యవసర ఉంటే శస్త్రచికిత్స లకు మొదటి ప్రాధాన్యతనిస్తామని చెప్పారు.