రామతీర్థంలోనూ అధికారికంగా నవమి వేడుకలు
విజయనగరం : విజయనగరం జిల్లా రామతీర్థంలోనూ ప్రభుత్వం అధికారికంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత రామతీర్థం, ఒంటిమిట్టలలో ఎక్కడ నిర్వహించాలనే దానిపై విస్తృత చర్చ సాగింది. ప్రభుత్వం ఒంటిమిట్టను ప్రత్యేక హోదా ఉన్న క్షేత్రంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ అధికార లాంఛనాలతో వేడుకలు జరుపుతోంది.
కాగా రామతీర్థంను ఎంపిక చేయకపోవడంపై ఉత్తరాంధ్ర సాధుపరిషత్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, భక్తులు ఆందోళనలు చేశారు. ఆమరణ నిరాహార దీక్షలకూ దిగారు. దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్పందించి రామతీర్థంలోనూ అధికారికంగా వేడుకలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వేడుకలకు మంత్రి మాణిక్యాలరావు సతీసమేతంగా హాజరై, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు సమర్పించనున్నారు. ఉదయం 10గంటలకు స్వామివారిని కల్యాణ మండపానికి తీసుకొచ్చి, 12 గంటలకు సీతారాముల కల్యాణం జరిపించనున్నారు. రామతీర్థంలో రాముడిని వనవాస రాముడిగా పిలుస్తారు.