ఐడిల్‌నెస్‌తో ఐడియాలు!
హ్యూమర్ ప్లస్
సోమరితనం మంచి గుణం కాదంటూ చాలా మంది ఈసడిస్తుంటారు. భాషలకు అతీతంగా సోమరితనాన్ని తిడుతూ సామెతలు పుట్టించారు. సోమరిని మొద్దు అనీ, సోంబేరి అనీ రకరకాల ప్రాంతీయభాషల్లో తూలనాడారు. నిజానికి సోమరిగా ఉండటం వల్లనే మనిషి అనేక విధాల పురోగతి సాధించాడని కొందరి అభిప్రాయం. అసలు వ్యవసాయం అనే ప్రక్రియ పుట్టిందే బద్దకం వల్ల కావచ్చని స్థిమితంగా ఆలోచిస్తే తెలుస్తుంది. రోజూ వేటాడటం బద్దకం అనిపించిన ఆదిమానవుడు తన వృత్తికి ప్రత్యామ్నాయం కనిపెట్టాడని కాస్త బద్దకంగా పడుకొని యోచిస్తే తెలుస్తుంది.
దీనికి అనేక తార్కాణాలు ఉన్నాయి.
ఉదాహరణకు రోజూ కూరొండుకోవడం కష్టమనిపించి మర్నాటికి నిల్వ ఉంచడం కోసమే ముందుగా పచ్చడి కనిపెట్టాడు. అందులో మరింత అడ్వాన్స్ అయిపోయి ఫ్రిజ్జును రూపొందించాడు. అందుకే మొట్టమొదట పచ్చడిని కనుగొన్నవారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలిగానీ.. ఆ కనిపెట్టిందెవరో వెతకడం కాస్త బద్దకమనిపించి మానేశారని కొందరు అంటుంటారు.
అలసత్వానికి అలవాటు పడ్డ మనిషికి ‘నడక బహు కష్టం’ అనిపించింది. రెండు కాళ్ల మీద నిలబడి, అదేపనిగా నడవటం కష్టమనిపించింది. దాంతో సీట్ మీద కూర్చొని తొక్కే సైకిల్ కనిపెట్టాడు. కానీ అక్కడితో ఆగిపోలేదు. స్టీరింగ్ ముందు బద్దకంగా కూర్చున్నా సునాయాసంగా ముందుకు వెళ్లడం కోసం కారు కనిపెట్టాడు. బద్దకానికి లెసైన్స్ ఇవ్వడం కోసం కారును దర్జాకు చిహ్నం అని వదంతులు వ్యాప్తి చేశారు.
ఈ బద్దకం అనే గుణమే లేకపోతే కార్లూ, విమానాలూ ఉండేవి కాదని కాళ్లు బార్లాజాపుకొని ఆలోచిస్తే, నిదానం మీద తెలుస్తుంది. ఇక ఇదే బద్దకం బాగా పెరిగిపోయి, వాహనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ‘ఆ... మళ్లీ ఎవడు స్టార్ట్ చేస్తాడులే’ అంటూ తన గుణాన్ని వాహనం ఇంజన్‌కూ నేర్పుతాడు. ఇలా ఇంజన్ చేత ఇంధనం ఖర్చు పెట్టిస్తాడు. కాలుష్యమైనా పెంచుతాడు కానీ కార్బ్యురెటర్ కాక తగ్గనివ్వడు.
సాధారణంగా మగవాళ్లే సోమరితనానికి అలవాటు పడి ఉంటారు. ‘ఏవోయ్... కాస్త కాఫీ ఇవ్వు... ఆ పేపర్ ఇలా అందించు... కళ్లజోడు అందుకో... టీవీ ఆన్ చెయ్ / టీవీ ఆఫ్ చెయ్’ అంటూ వాళ్ల పార్ట్నర్కు పనులు పురమాయిస్తుంటారు. ఇలాంటి వ్యాలిడ్ రీజన్ వల్లనే సోమరి‘పోతు’ అనే మాట పుట్టింది.
సోమరుల బుర్ర దెయ్యాలకు వర్క్‌షాప్ అంటుంటారు. ఆ సామెతను అపార్థం చేసుకుంటారు. కానీ ‘దెయ్యాలకు తగిన పని దొరుకుతుంది కదా, అవి సదరు మెదడును కార్యక్షేత్రం చేసుకొని పాపం కష్టించి పనిచేస్తున్నాయి కదా’ అని ఆలోచించరు. పైగా ‘బుర్రతిరుగుడు’ అని కూడా నిందించే అవకాశం ఉంది. కానీ అవి వచ్చి పనిచేయడం వల్లనే కదా... కొత్త కొత్త ఆలోచనలు పుట్టి, కొత్త కొత్త ఆవిష్కారాలు జరుగుతున్నాయి.
అందుకే ఆ ఇంగ్లిష్ సామెత విషయంలో మనుషులందరూ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ మీటింగులు అవీ పెట్టడం, పునరాలోచించుకోవడం వంటివి తిరిగి మనకే శ్రమను పెంచే పనులు. అందుకే ఎవరికి వారు ఒకసారి ‘ఇటీజ్ ఐడియల్ టు బి ఐడిల్’ అని ఒకసారి తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది.
- రాంబాబు