Ramdas Kadam
-
ఉద్ధవ్ ఠాక్రేకు దెబ్బమీద దెబ్బ.. శివసేనకు కదం ‘రాంరాం’
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. పార్టీలో కీలక, సీనియర్ నాయకులందరూ దశలవారీగా పార్టీ నుంచి బయటపడుతుండటంతో శివసేన రోజురోజుకూ బలహీనపడుతోంది. ఇప్పటికే గట్ నాయకులు, శాఖ ప్రముఖులు, విభాగ ప్రముఖులు, మాజీ, సిట్టింగ్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఇలా అనేకమంది ఉద్ధవ్‌ను వదిలేసి శిండే వర్గంలో చేరారు. తాజాగా శివసేన పార్టీలో సీనియర్ నేతగా, కట్టర్ శివసైనికుడిగా పేరుగాంచిన రాందాస్ కదం కూడా సోమవారం పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ పంపించారు. దీంతో ఉద్ధవ్‌కు చెందిన శివసేన పార్టీలో మరింత గందరగోళ పరిస్ధితి నెలకొంది. శిందే తిరుగుబాటు తరువాత ఉద్ధవ్‌ఠాక్రే వర్గం నుంచి బయటపడి ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గంలో చేరడానికి అనేకమంది నేతలు, పదాధికారులు, కార్యకర్తలు పోటీ పడుతున్నారు. అందులో భాగంగా శివసేన పార్టీలో సీనియర్ నేతగా, కట్టర్ శివసైనికుడిగా పేరుగాంచిన రాందాస్ కదం పార్టీ నేత పదవికి రాజీనామా చేసినట్లు ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. అయితే కదం ఏక్నాథ్ శిండే వర్గంలో చేరుతుండవచ్చనే ఊహగానాలు వస్తున్నాయి. తన గొంతులో ప్రాణమున్నంత వరకు తను శివసేనలోనే కొనసాగుతానని ఒకప్పుడు ప్రకటించిన కదం ఇప్పుడు ఆకస్మాత్తుగా పార్టీకి రాజీనామా చేయడం ఉద్ధవ్‌కు గట్టి షాకు తగిలినట్లైంది. కాగా ఇప్పటి వరకు తదుపరి కార్యాచరణ ఏంటనే దానిపై కదం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఉత్కంఠ రేపుతోంది. చదవండి: థాక్రేకు మరో షాక్.. షిండే వర్గంలోకి 12 మంది ఎంపీలు! బాల్ ఠాక్రేకు సన్నిహితునిగా... ఒకప్పుడు శివసేనలో తిరుగులేని నాయకుడిగా పేరు సంపాదించుకున్న సీనియర్ నేత రాందాస్ కదం దివంగత హిందు హృదయ్ సామ్రాట్ బాల్‌ఠాక్రేకు అతి సన్నిహితుడిగా మెలిగారు. ఆయన నేతృత్వంలో అనేక సంవత్సరాలు పార్టీలో కొనసాగారు. 2005–2009 వరకు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ముఖ్యంగా సీనియర్ నేతల్లో కదం ఒకరు కావడంతో ఆయనపై ఉద్ధవ్‌కు అపార నమ్మకం ఉంది. చివరకు ఆయన కూడా పార్టీ పదవికి రాజీనామా చేయడం ఉద్ధవ్ జీర్ణించుకోలేకపోతున్నారు. రాందాస్ కదం కొద్దిరోజులుగా పార్టీలో అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు విధాన పరిషత్‌లో ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తయిన తరువాత మరోసారి అవకాశం లభిస్తుందని ఆయన భావించారు. కానీ ఆయన అంచనాలు తారుమారయ్యాయి. అంతేగాకుండా శివసేన, బీజేపీ కూటమిలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హయాంలో కదం పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. కాని 2009లో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయనకు మంత్రి పదవి లభించలేదు. అప్పటి నుంచి కదంలో అసంతృప్తి మరింత పెరిగిపోయింది. శివసేన నుంచి బయట పడుతుండవచ్చని వదంతులు సైతం వచ్చాయి. కానీ తను కడవరకూ శివసేనలోనే కొనసాగుతానని ఆయన అప్పట్లో స్పష్టం చేశారు. అయితే సోమవారం ఆయన ఆకస్మాత్తుగా పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ ద్వారా తెలియజేయడం ఆందరికి ఆశ్చర్యానికి గురిచేసింది. ఉద్ధవ్‌పై రాందాస్ తీవ్ర వ్యాఖ్యలు.. మాజీ మంత్రి, శివసేన నేత రాందాస్ కదం పార్టీ పదవికి రాజీనామా చేసిన తరువాత పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కదం తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. గత మూడేళ్ల నుంచి నోరు మూసుకుని పార్టీలో కొనసాగుతున్నానని, బాల్ ఠాక్రే బతికి ఉంటే నేడు నాకు ఈ పరిస్ధితి వచ్చేది కాదని, అందుకే పార్టీ పదవికి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు. బాల్ ఠాక్రేకు విశ్వాస పాత్రుడిని కావడంవల్లే ఆయన నాకు పార్టీలో వివిధ పదవులు కట్టబెట్టారు. ఆయన మరణించిన తరువాత నాకు విలువ లేకుండా పోయింది. ఇది నేను కొంత కాలంగా గమనిస్తున్నాను. నన్ను విశ్వాసంలోకి తీసుకోకుండానే పార్టీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా నన్ను విశ్వాసంలోకి తీసుకోలేదు. నా కుమారుడు, ఎమ్మెల్యే యోగేశ్ కదంను కూడా అనేకసార్లు అవమాన పరిచారు. 2019లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నన్ను మాతోశ్రీ బంగ్లాకు పిలిపించారు. నీపై ఎవరు ఎలాంటి ఆరోపణలు, వ్యాఖ్యలు చేసినా మీడియా ఎదుట నోరు విప్పవద్దని హెచ్చరించారు. అప్పుడు అలా ఎందుకు హెచ్చరించారో ఇప్పటికీ నాకు అర్ధం కాలేదన్నారు. బాల్ ఠాక్రే బతికున్నంత కాలం ప్రత్యర్థులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో పోరాడుతూ హిందుత్వాన్ని బతికించారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టవద్దని, హిందుత్వానికి కట్టుబడి ఉండాలని లేదంటే బాల్ ఠాక్రేను అవమాన పర్చినట్లవుతుందని పలుమార్లు ఉద్ధవ్‌కు విజ్ఞప్తి చేశాను. కానీ ఆయన మాటలను లెక్కచేయలేదు. ఇది కూడా తనను కలచివేసిందని కదం స్పష్టం చేశారు. -
'పార్టీ కోసం నా జీవితం అర్పించా.. కాషాయం విడిచేది లేదు'
సాక్షి, ముంబై: తన తుది శ్వాస వరకు కాషాయన్ని విడిచిపెట్టేది లేదని శివసేన నేత, మాజీ ఎమ్మెల్సీ రామ్‌దాస్ కదమ్ స్పష్టం చేశారు. తనను పార్టీలో నుంచి తీసేసినా తాను శివసైనికునిగానే ఉంటానని ఆయన ఉద్ఘాటించారు. అయితే, తన కుమారుడితో పాటు మద్దతుదారుల భవిష్యత్తు కోసం త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చని ఓ వైపు హెచ్చరికలు జారీ చేస్తూనే శివసేనపై తన అసంతృప్తిని వెల్లగక్కారు. మాజీ ఎమ్మెల్సీ అయిన రామ్‌దాస్ కదమ్‌పై పార్టీకి ద్రోహం చేశారన్న ఆరోపణలు రావడంతో పార్టీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం ఇవ్వలేదు. దీనిపై ఇప్పటివరకు మౌనంగానే ఉన్న ఆయన.. శనివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీలో చేరనున్నట్టు కొన్ని స్థానిక దిన పత్రికలలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఆ వార్తలను అనిల్ పరబ్ అచ్చు వేయించారని, అనంతరం వాటిని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు చూపించి తనపై కుట్ర చేశారని కదమ్ ఆరోపించారు. తనకు ఉద్ధవ్ ఠాక్రే సమయం కేటాయిస్తే అన్ని విషయాలను వివరంగా తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శివసేనలోనే ఉన్న కొందరు పార్టీ లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. కాషాయ జెండా బీజేపీది కాదని, శివసేనది అని అన్నారు. తనపై ఉద్ధవ్ ఠాక్రే వైఖరి ఏమిటనేది తెలుసుకున్న అనంతరం తాను నిర్ణయం తీసుకుంటానని రామ్‌దాస్ కదమ్ వెల్లడించారు. ‘శివసేన పార్టీ కోసం నా జీవితం అర్పించాను. 52 ఏళ్లపాటు శ్రమించాను. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రే కారులో ముందు సీట్లో నేను కూర్చున్నాను’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వచ్ఛమైన శివసైనికుడిని అయినప్పటికీ తనను రాజకీయంగా పతనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన అధ్యక్షుడు అయిన తర్వాత ఆయనతో తాను ఒక్కసారే భేటీ అయ్యానన్నారు. రెండున్నరేళ్ల ముందే తాను ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించానని గుర్తు చేశారు. ‘అయినప్పటికీ నాకు వ్యతిరేకంగా వార్తలు వినిపిస్తున్నాయి. నేను ఎన్నడూ టికెట్ కావాలని డిమాండ్ చేయలేదు. కానీ, నాపై ఇలా ఎందుకు అసత్య ప్రచారం జరుగుతోంది. ఇదంతా అనిల్ పరబ్ చేస్తున్న కుట్రే’అంటూ ఆరోపించారు. ‘ఓవైపు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారిని కలిసేందుకు అనిల్ పరబ్ సమయం కేటాయించడం లేదు. కానీ, మూడు రోజులపాటు రత్నగిరిలో ఉంటాడు. ఈ విషయాలన్నీ ఉద్ధవ్ ఠాక్రే గుర్తిస్తారని అనుకుంటున్నాను. నేను బాల్ ఠాక్రేపై ఒట్టు వేసి చెబుతున్నా. నేను ఎన్నడూ బీజేపీ నేత కిరీట్ సోమయ్యను కలువలేదని’అని రామ్‌దాస్ కదమ్ స్పష్టం చేశారు. -
చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి
ముంబై: మహారాష్ట్ర సీఎం పదవిని రెండున్నరేళ్ల పాటు పంచుకుందామనే ఒప్పందంతోనే బీజేపీ, శివసేన మధ్య పొత్తు జరిగిందని శివసేన మంత్రి రామ్‌దాస్ కదం వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందానికి కట్టుబడకూడదని భావిస్తే ఎన్నికలకు ముందుగానే బీజేపీ తన పొత్తును రద్దుచేసుకోవచ్చని బుధవారం స్పష్టం చేశారు. బీజేపీ, శివసేన మధ్య రెండు ప్రధాన అంశాల గురించి ఒప్పందం కుదిరిందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని చెరి సగం కాలం పాటు పంచుకోవటం ఒకటి కాగా.. కొంకణ్ ప్రాంతంలోని నానార్ రిఫైనరీ ప్రాజెక్టును రద్దు చేయడం రెండోదని వెల్లడించారు. కాగా, ఒప్పందం జరిగిన తర్వాత బీజేపీ రాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పటేల్ పొత్తును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రామ్‌దాస్ పరోక్షంగా మండిపడ్డారు. -
‘కదం’ కథ కంచికేనా!
సాక్షి, ముంబై: కొంకణ్ ప్రాంత శివసేన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాందాస్ కదంకు పార్టీలో వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. దీంతో ఆ పార్టీ అగ్రనాయకుడు మనోహర్ జోషి లాగే కదం కూడా పార్టీలో ఏకాకిగా మిగిలిపోతారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు కాషాయ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన కదం అనంతరం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. కదం గత శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత కొంకణ్ ప్రాంతంలోనే ఉండి పార్టీలో మళ్లీ పట్టుసాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా పార్టీలోనే కదంకు ప్రధాన పోటీదారులుగా ఉన్న ఎంపీ అనంత్ గీతే, ఎమ్మెల్యే సూర్యకాంత్ దల్వీ కొంకణ్‌లో పార్టీపరంగా కదం కంటే ముందంజలో ఉన్నారు. ఆ ప్రాంతంలో మాజీ మంత్రి హవాను తగ్గిస్తూ తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఉత్తర రత్నగిరి జిల్లాలో తమ మద్దతుదారులకు పార్టీ పదవులు కట్టబెట్టారు. ఇప్పటివరకు తన మద్దతుదారులుగా ఉన్నవారిని పార్టీ పదవుల నుంచి తొలగించి, తనకు పరోక్షంగా దెబ్బకొట్టిన ఎంపీ, ఎమ్మెల్యేల తీరుపై కదం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారం కిందట గుహగర్ తాలూకాలో గీతే ఏర్పాటుచేసిన ర్యాలీలో కదంను లక్ష్యంగా చేసుకుని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పార్టీలో మార్పులు సహజమని, ఆ మార్పులను పార్టీ కార్యకర్తలు అంగీకరించక తప్పదని అన్నారు. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదేశాల మేరకే ఉత్తర రత్నగిరి జిల్లాలో పదాధికారుల నియామకాలు జరిగాయని, వాటిని ప్రతీ శివసైనికుడు స్వీకరించక తప్పదని, దీనిపై వ్యాఖ్యలుచేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. ఇదే ర్యాలీలో గుహగర్ శాసనసభ నియోజక వర్గం ప్రజాసంబంధాల అధికారి సురేశ్ పాలండే మాట్లాడుతూ ఒకరిద్దరు గడ్డాలున్న నాయకులు (కదంకు గడ్డం ఉంది) ఇటూ, అటూ వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమి లేదని, అలా గడ్డాలున్న నాయకులు తమ పార్టీలో అనేకమంది ఉన్నారని కదంకు పరోక్షంగా చురక అంటించారు. కాగా, గీతే, పాలండే వ్యాఖ్యలపై పార్టీలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కదం మాట్లాడుతూ ప్రస్తుతం పార్టీ నాయకత్వం కొంకణ్ ప్రాంతంలో తనకు ఎలాంటి పదవీ బాధ్యతలు అప్పగించలేదన్నారు. అందుకే తాను మౌనంగా ఉన్నానని, గుహగర్ తాలూకాలో జరిగిన ర్యాలీలో ఎవరు.. ఏం మాట్లాడారో.. తనకు తెలిసిందన్నారు. దీనిపై పార్టీ శ్రేణులు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీలో నమ్మకద్రోహులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన కార్యకర్తలను, పదాధికారులను ఇళ్లకు పరిమితం చేస్తున్నారని దుయ్యబట్టారు. గుహగర్ ప్రసంగంపై మాతోశ్రీ వర్గాలు తప్పకుండా చర్యలు తీసుకుంటాయని, ఆ నమ్మకం తనకుందన్నారు. అంతవరకు వేచి చూస్తానని అన్నారు.