సాక్షి, ముంబై: తన తుది శ్వాస వరకు కాషాయన్ని విడిచిపెట్టేది లేదని శివసేన నేత, మాజీ ఎమ్మెల్సీ రామ్‌దాస్ కదమ్ స్పష్టం చేశారు. తనను పార్టీలో నుంచి తీసేసినా తాను శివసైనికునిగానే ఉంటానని ఆయన ఉద్ఘాటించారు. అయితే, తన కుమారుడితో పాటు మద్దతుదారుల భవిష్యత్తు కోసం త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చని ఓ వైపు హెచ్చరికలు జారీ చేస్తూనే శివసేనపై తన అసంతృప్తిని వెల్లగక్కారు. మాజీ ఎమ్మెల్సీ అయిన రామ్‌దాస్ కదమ్‌పై పార్టీకి ద్రోహం చేశారన్న ఆరోపణలు రావడంతో పార్టీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం ఇవ్వలేదు.
దీనిపై ఇప్పటివరకు మౌనంగానే ఉన్న ఆయన.. శనివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీలో చేరనున్నట్టు కొన్ని స్థానిక దిన పత్రికలలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఆ వార్తలను అనిల్ పరబ్ అచ్చు వేయించారని, అనంతరం వాటిని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు చూపించి తనపై కుట్ర చేశారని కదమ్ ఆరోపించారు. తనకు ఉద్ధవ్ ఠాక్రే సమయం కేటాయిస్తే అన్ని విషయాలను వివరంగా తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శివసేనలోనే ఉన్న కొందరు పార్టీ లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. కాషాయ జెండా బీజేపీది కాదని, శివసేనది అని అన్నారు. తనపై ఉద్ధవ్ ఠాక్రే వైఖరి ఏమిటనేది తెలుసుకున్న అనంతరం తాను నిర్ణయం తీసుకుంటానని రామ్‌దాస్ కదమ్ వెల్లడించారు.
‘శివసేన పార్టీ కోసం నా జీవితం అర్పించాను. 52 ఏళ్లపాటు శ్రమించాను. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రే కారులో ముందు సీట్లో నేను కూర్చున్నాను’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వచ్ఛమైన శివసైనికుడిని అయినప్పటికీ తనను రాజకీయంగా పతనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన అధ్యక్షుడు అయిన తర్వాత ఆయనతో తాను ఒక్కసారే భేటీ అయ్యానన్నారు. రెండున్నరేళ్ల ముందే తాను ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించానని గుర్తు చేశారు. ‘అయినప్పటికీ నాకు వ్యతిరేకంగా వార్తలు వినిపిస్తున్నాయి. నేను ఎన్నడూ టికెట్ కావాలని డిమాండ్ చేయలేదు. కానీ, నాపై ఇలా ఎందుకు అసత్య ప్రచారం జరుగుతోంది. ఇదంతా అనిల్ పరబ్ చేస్తున్న కుట్రే’అంటూ ఆరోపించారు.
‘ఓవైపు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారిని కలిసేందుకు అనిల్ పరబ్ సమయం కేటాయించడం లేదు. కానీ, మూడు రోజులపాటు రత్నగిరిలో ఉంటాడు. ఈ విషయాలన్నీ ఉద్ధవ్ ఠాక్రే గుర్తిస్తారని అనుకుంటున్నాను. నేను బాల్ ఠాక్రేపై ఒట్టు వేసి చెబుతున్నా. నేను ఎన్నడూ బీజేపీ నేత కిరీట్ సోమయ్యను కలువలేదని’అని రామ్‌దాస్ కదమ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment