సాక్షి, ముంబై: కొంకణ్ ప్రాంత శివసేన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాందాస్ కదంకు పార్టీలో వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. దీంతో ఆ పార్టీ అగ్రనాయకుడు మనోహర్ జోషి లాగే కదం కూడా పార్టీలో ఏకాకిగా మిగిలిపోతారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు కాషాయ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన కదం అనంతరం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. కదం గత శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత కొంకణ్ ప్రాంతంలోనే ఉండి పార్టీలో మళ్లీ పట్టుసాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా పార్టీలోనే కదంకు ప్రధాన పోటీదారులుగా ఉన్న ఎంపీ అనంత్ గీతే, ఎమ్మెల్యే సూర్యకాంత్ దల్వీ కొంకణ్‌లో పార్టీపరంగా కదం కంటే ముందంజలో ఉన్నారు.
ఆ ప్రాంతంలో మాజీ మంత్రి హవాను తగ్గిస్తూ తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఉత్తర రత్నగిరి జిల్లాలో తమ మద్దతుదారులకు పార్టీ పదవులు కట్టబెట్టారు. ఇప్పటివరకు తన మద్దతుదారులుగా ఉన్నవారిని పార్టీ పదవుల నుంచి తొలగించి, తనకు పరోక్షంగా దెబ్బకొట్టిన ఎంపీ, ఎమ్మెల్యేల తీరుపై కదం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారం కిందట గుహగర్ తాలూకాలో గీతే ఏర్పాటుచేసిన ర్యాలీలో కదంను లక్ష్యంగా చేసుకుని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పార్టీలో మార్పులు సహజమని, ఆ మార్పులను పార్టీ కార్యకర్తలు అంగీకరించక తప్పదని అన్నారు. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదేశాల మేరకే ఉత్తర రత్నగిరి జిల్లాలో పదాధికారుల నియామకాలు జరిగాయని, వాటిని ప్రతీ శివసైనికుడు స్వీకరించక తప్పదని, దీనిపై వ్యాఖ్యలుచేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు.
ఇదే ర్యాలీలో గుహగర్ శాసనసభ నియోజక వర్గం ప్రజాసంబంధాల అధికారి సురేశ్ పాలండే మాట్లాడుతూ ఒకరిద్దరు గడ్డాలున్న నాయకులు (కదంకు గడ్డం ఉంది) ఇటూ, అటూ వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమి లేదని, అలా గడ్డాలున్న నాయకులు తమ పార్టీలో అనేకమంది ఉన్నారని కదంకు పరోక్షంగా చురక అంటించారు. కాగా, గీతే, పాలండే వ్యాఖ్యలపై పార్టీలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కదం మాట్లాడుతూ ప్రస్తుతం పార్టీ నాయకత్వం కొంకణ్ ప్రాంతంలో తనకు ఎలాంటి పదవీ బాధ్యతలు అప్పగించలేదన్నారు. అందుకే తాను మౌనంగా ఉన్నానని, గుహగర్ తాలూకాలో జరిగిన ర్యాలీలో ఎవరు.. ఏం మాట్లాడారో.. తనకు తెలిసిందన్నారు. దీనిపై పార్టీ శ్రేణులు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీలో నమ్మకద్రోహులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన కార్యకర్తలను, పదాధికారులను ఇళ్లకు పరిమితం చేస్తున్నారని దుయ్యబట్టారు. గుహగర్ ప్రసంగంపై మాతోశ్రీ వర్గాలు తప్పకుండా చర్యలు తీసుకుంటాయని, ఆ నమ్మకం తనకుందన్నారు. అంతవరకు వేచి చూస్తానని అన్నారు.
‘కదం’ కథ కంచికేనా!
Published Thu, Oct 31 2013 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement