కాపులను బీసీల్లో చేరిస్తే ఉద్యమిస్తాం
– బీసీ సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరిక
– కలెక్టరేట్ ముట్టడికి యత్నం, అరెస్టు చేసిన పోలీసులు
అనంతపురం అర్బన్ : బీసీల హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తోందని, కాపులను బీసీల్లోకి చేర్చుతామని పదే పదే చెబుతోందని, అదే జరిగితే పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరించారు. బీసీ హక్కులను పరిరక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సి.రమేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడికి నాయకులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అంతకు ముందు కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జాతీయ కార్యదర్శి బోరంపల్లి ఆంజనేయులు, ఎస్.ఆర్.నాగభూషణం, మహిళ అధ్యక్షురాలు కృష్ణవేణి, మైనార్టీ నాయకులు సి.జాఫర్, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గాల నాయకులు మాట్లాడారు.
బీసీల హక్కులను కాలరాసేలా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు. బీసీ సంక్షేమాన్ని విస్మరించే పార్టీలకు పుట్టగతులుండవన్నారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీ సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం కేటాయించాలన్నారు. బ్యాంకులు, జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండా బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అర్హులైన బీసీలకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు జోగి రాజేంద్ర, అనిల్‌కుమార్, ముట్టాల శ్రీనివాసులు, దాసరి శ్రీనివాసులు, సంపంగి గోవర్ధన్, కోటకొండ కిష్టప్ప, జయపాల్ యాదవ్, నియోజకవర్గాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.